పాకిస్థాన్‌లో భారత్ దాడి చేసిన ప్రాంతంలో జైష్, లష్కర్ ఉగ్రవాదుల సమావేశం.. భారీగా తరలివెళ్లిన టెర్రరిస్టులు
జైషే మొహమ్మద్ మరో ‘ఫిదాయీన్’ దళాన్ని (ఆత్మాహుతి దళం) దాడికి సిద్ధం చేస్తోందని, నిధులు సమకూర్చుకుంటోందని గత నెలలో జాతీయ మీడియాతో వార్తలు వచ్చాయి.
Bahawalpur: పాకిస్థాన్ ప్రోత్సాహంతో నడిచే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలు తాజాగా బహావల్పూర్‌లో సమావేశం నిర్వహించాయి. దీనికి పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హాజరయ్యారు.
ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ దాడితో లష్కరే తోయిబాకు సంబంధం ఉంది. నవంబర్‌లో ఢిల్లీ కార్ బాంబు దాడిలో 15 మంది మృతి చెందారు. ఈ దాడితో జైషే మొహమ్మద్‌కు సంబంధం ఉంది.
ఈ రెండు ఉగ్రవాద సంస్థలే సమావేశం కావడం గమనార్హం. పాక్ బహావల్పూర్‌లోని జైష్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ స్థలం ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దళాలు బాంబు దాడి చేసిన ప్రదేశాల్లో ఒకటి.
Also Read: Revanth Reddy: మా లక్ష్యాలు ఇవే: గ్లోబల్ సమిట్‌లో రేవంత్ రెడ్డి
లష్కరే తోయిబా వైస్ చీఫ్ సైఫుల్లా కసూరీ కూడా జైష్ కమాండర్లతో కలిసి ఈ సమావేశానికి హాజరయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ రవలాకోట్ ప్రాంతంలో ఉగ్ర లాంచ్ ప్యాడ్లు మళ్లీ నిర్మిస్తున్నారని జాతీయ మీడియాకు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతం కూడా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దళాలు లక్ష్యంగా చేసిన ప్రదేశమే.
జైషే మొహమ్మద్ మరో ‘ఫిదాయీన్’ దళాన్ని (ఆత్మాహుతి దళం) దాడికి సిద్ధం చేస్తోందని, నిధులు సమకూర్చుకుంటోందని గత నెలలో జాతీయ మీడియాతో వార్తలు వచ్చాయి. నిధుల సేకరణ డిజిటల్ మార్గాల్లో జరుగుతోందని, పాక్ యాప్ ‘సదాపే’ ద్వారా కూడా జరుగుతోందని తెలుస్తోంది.
