వాటర్ ట్యాంకర్‌తో వరద నుంచి టోక్యో సేఫ్.. భూగర్భంలో భారీ ఐడియా!!

Japan’s underground flood control tunnel:Japan రాజధాని Tokyo నగరం ముందు చూపుతో బయటపడింది. వరద ముప్పు నుంచి తనను తాను రక్షించుకోడానికి ఏర్పాట్లు చేసుకుంది. ప్రపంచ నగరాలకే టోక్యో పాఠాలు చెబుతోన్న టోక్యో.. ఏం చేసిందో తెలుసా.
వాతావరణ మార్పులు, పెరుగుతున్న భూతాపాన్ని దృష్గ్టిలో పెట్టుకుని ముందుగా జాగ్రత్త పడిన నగరం టోక్యో. భారీ వర్షాలు, తుఫాన్లు నగరాన్ని వరదలతో ముంచెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకున్న నగరం టోక్యో. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించుకున్న నగరం టోక్యో. దీని కంతటికీ కారణం టోక్యో నిర్మించిన భూగర్భ వరద నియంత్రణ ప్రాజెక్టు.
]
ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న నగరాలు దీని నుంచి పాఠాలు నేర్చుకోవలసి ఉంది. 2009 లో మొదటి దశ పూర్తి చేసుకున్న ప్రాజెక్టు.. వరద నీటిని మళ్లించడానికి చేపట్టిన ప్రాజెక్టులలో ప్రపంచంలోనే పెద్దది.
వర్షాలు, టైఫూన్లు వచ్చే కాలంలో నగరంలోని కాల్వలు, నదులు పొంగి పొర్లకుండా భారీ స్థాయిలో వరద నీటిని మళ్లించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. టోక్యో నగరంలో చిన్నాపెద్దా కలిసి దాదాపు వంద నదుల వరకూ ప్రవహిస్తుంటాయి. నిజానికి జపాన్‌లో ప్రకృతి బీభత్సం ఎక్కువ. భారీ వర్షాలు, వరదలు ఎక్కువగా ఉంటాయి. ఆపైన భూతాపం పెరుగుతోంది.
క్రమేణా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాని వల్ల ప్రకృతి వైపరీత్యాలు మరింత పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం , ఆస్తి నష్టం జరుగుతోంది . జపాన్ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం గడిచిన నాలుగు దశాబ్దాల్లో టైఫూన్లు ఒకటిన్నర రెట్లు పెరిగినట్లు తెలుస్తుంది.
అందుకే ముందు జాగ్రత్తగా వరద నీరు మళ్లించడానికి టోక్యో భారీ ప్రాజెక్టు చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు అండర్ గ్రౌండ్‌లో నిర్మించారు. టోక్యో శివార్లలో 50 మీటర్ల కింద అయిదు అతి పెద్ద గోతులు తవ్వారు . వాటిని కాంక్రీట్‌తో నిర్మించారు. ఒక్కొక్కటి 65 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 32 మీటర్ల చుట్టుకొలతతో నిర్మించారు. ఆరున్నర కిలోమీటర్ల సొరంగాలకు వీటిని కలిపారు.
వీటితో పాటే మరో భారీ వాటర్ ట్యాంక్ నిర్మించారు. ఇరవై అయిదున్నర మీటర్ల ఎత్తు, 177 మీటర్ల పొడవు, 78 మీటర్ల వెడల్పుతో ఈ ట్యాంక్ నిర్మించారు. 500 టన్నుల బరువున్న 59 భారీ పిల్లర్లు నిర్మించారు. రెండు ఫుట్‌బాల్ కోర్టులంత భారీ వాటర్ ట్యాంక్‌ను ఇవి కాపాడుతాయి.
నీటిని మళ్లించడానికి ఒక్కోటీ పది మెగావాట్ల విద్యుత్ తో పనిచేసే 13 వందల హార్స్ పవర్ పంపులు 78 ఏర్పాటు చేశారు. ఈ పంపులు సెకనుకు 200 టన్నుల నీటిని ఏడో నదిలోకి పంపు చేస్తాయి .
వర్షాలు, టైఫూన్లు వచ్చే కాలంలో ఇక్కడ పని చేసే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. ఈ ప్రాజెక్టు వల్ల టోక్యో పరిసరాల్లో 90 శాతం ఇళ్లను వరద ముంపు నుంచి కాపాడారు. మున్ముందు మరో పది అండర్ గ్రౌండ్ రిజర్వాయర్లు, మరో మూడు వరద సొరంగాలు కూడా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.