Iran Unrest: నోరు విప్పిన ఖమేనీ.. ఇరాన్‌లో రక్తపాతానికి వాళ్లే కారణం అంటూ ఆగ్రహం.. వదిలేది లేదని వార్నింగ్
ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, మరోవైపు యుద్ధ వాతావరణ పరిస్థితులు.. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వచ్చేస్తున్నారు.
Ayatollah Ali Khamenei Representative Image (Image Credit To Original Source)
- ఇరాన్ లో రక్తపాతానికి అమెరికా, ఇజ్రాయల్ కారణం
- ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ట్రంప్ హస్తం
- నేరస్తులను శిక్షించకుండా వదిలేది లేదు
Iran Unrest: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలు రక్తపాతానికి కారణం అయ్యాయి. నిరసనకారులను అణిచివేసేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో వేలాది మంది మరణించారు. ఈ వ్యవహారంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మౌనం వీడారు. ఇరాన్ లో విధ్వంసానికి, రక్తపాతానికి అమెరికా, ఇజ్రాయల్ కారణం అంటూ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ని క్రిమినల్ అని సంబోధించారు. ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ట్రంప్ హస్తం ఉందని ఆరోపించారు.
ఇరాన్ లో జరుగుతున్న విధ్వంసానికి, రక్తపాతానికి విదేశీయులే కారణమన్నారు ఖమేనీ. అమెరికా, ఇజ్రాయల్‌తో సంబంధం ఉన్న వారు భారీ నష్టాన్ని కలిగించి, వేలాది మందిని చంపారని ఆరోపించారు. అయితే, దేశాన్ని యుద్ధంలోకి లాగబోము అని తేల్చి చెప్పారు. అలానే స్థానిక, అంతర్జాతీయ నేరస్తులను శిక్షించకుండా వదలబోము అని తేల్చి చెప్పారు ఖమేనీ.
”రెండు వారాలకుపైగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది. ఇజ్రాయల్, అమెరికాతో సంబంధం ఉన్న వారు భారీ నష్టాన్ని కలిగించారు. వేల మందిని చంపారు. హింసలో రెండు దేశాలు ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరస్తుడు. దీర్ఘకాల భౌగోళిక రాజకీయ ప్రత్యర్థులు ప్రధానంగా ఇజ్రాయల్, అమెరికా ఇరాన్ లో అస్థిరతకు కారణం” అంటూ ఖమేనీ విరుచుకుపడ్డారు. ఇరాన్ లో ఈ పరిస్థితికి బాధ్యులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఖమేనీ హెచ్చరించారు. మేము దేశాన్ని యుద్ధంలోకి లాగము, కానీ దేశీయ, అంతర్జాతీయ నేరస్తులను శిక్షించకుండా ఉండము అని తేల్చి చెప్పారు.
ఓవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, మరోవైపు యుద్ధ వాతావరణ పరిస్థితులు.. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ పౌరులు వెనక్కి వచ్చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున ఇరాన్‌కు ప్రయాణాలు మానుకోవాలని ఇండియన్ ఎంబసీ ఇప్పటికే హెచ్చరించింది. ఇరాన్ లో 9వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది చదువుకోవడానికి వెళ్లిన వారే.
Also Read: వెనెజువెలా తరహాలో దాడికి అమెరికా సన్నాహాలు..? ఇరాన్ వైపు అమెరికా యుద్ధనౌకలు..
