భారతదేశ ఒత్తిడి, సుదీర్ఘ మంతనాల తర్వాత, 10మంది భారత సైనికులను విడుదల చేసిన చైనా

ఇండో-చైనా సరిహద్దుల్లో సోమవారం(జూన్ 15,2020) రాత్రి లడ్డాఖ్ లోని గాల్వన్ లోయలో చైనా-భారత్ సైనికుల

  • Published By: naveen ,Published On : June 19, 2020 / 02:32 AM IST
భారతదేశ ఒత్తిడి, సుదీర్ఘ మంతనాల తర్వాత, 10మంది భారత సైనికులను విడుదల చేసిన చైనా

Updated On : June 19, 2020 / 2:32 AM IST

ఇండో-చైనా సరిహద్దుల్లో సోమవారం(జూన్ 15,2020) రాత్రి లడ్డాఖ్ లోని గాల్వన్ లోయలో చైనా-భారత్ సైనికుల

ఇండో-చైనా సరిహద్దుల్లో సోమవారం(జూన్ 15,2020) రాత్రి లడ్డాఖ్ లోని గాల్వన్ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనాకు చెందిన 43మంది సైనికులు చనిపోయినట్టు సమాచారం. కాగా ఘర్షణ సందర్భంగా పలువురు భారతీయ సైనికులు మిస్ అయ్యారా? మన సైనికులను చైనా ఆర్మీ బందీలుగా పట్టుకుందా? చర్చల తర్వాత వారిని విడుదల చేసిందా? అవుననే అంటోంది జాతీయ మీడియా. ఘర్షణ సమయంలో బందీలుగా చిక్కిన 10మంది భారత సైనికులను చైనా ఆర్మీ విడుదల చేసిందని వార్తలు రాశాయి.

బందీలుగా ఉన్న 10మంది భారత సైనికులను వదిలిపెట్టిన చైనా:
హింసాత్మక ఘర్షణ జరిగిన 3 రోజుల తర్వాత చైనా ఆర్మీ తమ కస్టడీలో ఉన్న 10మంది భారత సైనికులను వదిలిపెట్టిందని జాతీయ మీడియా చెప్పింది. గురువారం(జూన్ 18,2020) సాయంత్రం వారిని విడుదల చేశారంది. చైనా ఆర్మీ విడుదల చేసిన 10మందిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్, ముగ్గురు మేజర్లు కూడా ఉన్నారు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో తమ కస్టడీలో ఉన్నవారిని చైనా విడుదల చేసినట్లు సెక్యూరిటీ వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బుధవారం(జూన్ 17,2020) మేజర్ జనరల్ స్థాయిలో భారత్-చైనా మధ్య చర్చలు జరిగాయి. అందులో జరిగిన ఒప్పందం మేరకు తమ కస్టడీలో ఉన్న భారత సైనికులకు ఎలాంటి హాని తలపెట్టకుండా చైనా స్వేచ్చగా వదిలిపెట్టింది. చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో కొంతమంది భారత సైనికులు కనిపించకుండా పోయినట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే చైనా ఇప్పుడు 10మందిని వదిలిపెట్టింది. ఈ ఘటనలో ఇక మిస్సింగ్ అయిన వారు ఎవరూ లేనరి భారత ఆర్మీ వర్గాలు ప్రకటించినట్టు జాతీయ మీడియా తెలిపింది.

దెబ్బకు దెబ్బ.. భారత దళాలు ఆయుధాలు దగ్గర ఉంచుకోండి:
ఈ ఘటన తర్వాత కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోర్డర్ లో విధుల్లో ఉండే భారత దళాలు పోస్టుని వదిలి వెళ్లే సమయంలో తమ వెంట ఆయుధాలు ఉంచుకోవాలని చెప్పారు. ఒప్పందం ప్రకారం గాల్వన్ లోయలో విధుల్లో ఉండేవారి దగ్గర ఆయుధాలు ఉండకూడదు. కానీ చైనా దొంగ దెబ్బతీసింది. పథకం ప్రకారం నిరాయుధులైన భారత సైనికులపై కర్రలు, ఇనుప చువ్వలు చుట్టిన రాడ్లతో దాడి చేసింది. ఈ ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో భారత దళాలు తమ దగ్గర ఆయుధాలు ఉంచుకోవాలని జైశంకర్ చెప్పారు.

గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణ:
తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం(జూన్ 15,2020) రాత్రి తీవ్రస్థాయిలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనలో 20మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ఈ ఘర్షణలో తమవైపు జరిగిన ప్రాణనష్టాన్ని చైనా ఇంత వరకు ప్రకటించ లేదు. ముందుగా ప్లాన్ చేసిన ప్ర‌కారం గాల్వన్‌లో ఇండియన్ ఆర్మీపై చైనా దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. దాని వ‌ల్లే తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకున్న‌ాయని సమాచారం. కాగా, మీరు చొరబడ్డారంటే మీరు ఆక్రమణకు దిగారంటూ ఇరుదేశాల ప్రతినిధులు వాదించుకుంటున్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దులు సరిగా లేకపోవడంతో ఈ ఘర్షణలకు అవకాశం ఏర్పడుతోంది. ఈ పరిణామాలు ఈ ప్రాంతపు నైసర్గిక స్వరూపంలో మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.

1

భారత సైనికులపై దాడికి చైనా సైనికులు వాడిన క్రూరమైన ఆయుధం ఇదేనా:
ఈ ఘర్షణలో భారత సైనికులపై దాడి చేసేందుకు చైనా సైనికులు వాడిన ఆయుధంగా చెబుతూ ఓ ఫొటో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో దీన్ని ప్రస్తావిస్తూ, చైనా తీరుపై భారత్‌లో చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇనుప రాడ్‌కు అన్ని వైపులా మేకులతో ఉన్న ఆ ఆయుధం ఫొటో గురించి రెండు దేశాల సైన్యాలు మాత్రం ఇంతవరకూ ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు. గాల్వన్ లోయ లద్ధాఖ్‌లో ఉంది. ఇక్కడ ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయి. ఎల్‌ఏసీ పశ్చిమ సెక్టార్‌లో, అక్సాయ్ చిన్‌కు సమీపంలో ఈ ప్రాంతం ఉంది. అక్సాయ్ చిన్ ఇప్పుడు చైనా నియంత్రణలో ఉంది. అయితే, ఇది తమ భూభాగమని భారత్ వాదిస్తోంది.

45ఏళ్లలో సైనికుల ఘర్షణలో ప్రాణాలు పోవడం ఇదే తొలిసారి:
14వేల అడుగుల ఎత్తున్న కొండ ప్రాంతంలో సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, కొందరు సైనికులు వేగంగా ప్రవహించే గాల్వాన్ నదిలోకి పడిపోయారని వార్తలు వచ్చాయి. ఈ వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో గత 45 ఏళ్లలో సైనికుల ఘర్షణలో ప్రాణాలు పోవడం ఇదే మొదటి సారి. కర్రలు, బ్యాట్లతో సైనికులు తలపడ్డారని, కాల్పులు జరగలేదని వార్తలొచ్చాయి. అయితే, సరిహద్దుల్లో మందుగుండు ఆయుధాలు లేకుండా భారత్, చైనా సైనికులు తలపడటం ఇదేమీ మొదటిసారి కాదు. ఎల్ఏసీ వెంబడి ఇదివరకు కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా, గాల్వన్ దగ్గర జరిగిన ఘర్షణ వెనుక కుట్రకోణం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే చైనా సైనికులు భారత సైనికులపై దాడి చేసి హతమార్చారని తెలుస్తోంది.

ఇండో-చైనా జవాన్ల మధ్య ఘర్షణకి కారణం ఇదే:
భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీయడానికి టెంట్‌ దగ్గర జరిగిన గొడవే కారణమని తెలుస్తోంది. వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ-Line Of Actual Control) ఇటువైపున భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా సైనికులు అక్కడ టెంట్‌ ఏర్పాటు చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 దగ్గర చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్‌ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. జూన్ నెల ప్రారంభంలోనే ఈ టెంట్‌ వేశారు.

టెంట్ తొలగించే సమయంలో దొంగ దాడి చేసిన చైనా:
గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్‌ కమాండర్‌ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. జూన్‌ 6న భారత్‌, చైనా లెఫ్టినెంట్‌ జనరల్‌ ర్యాంకు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో టెంట్‌ తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలో ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 పైభాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఆరుగంటల పాటూ జరిగిన తోపులాటలో పక్కనే ఉన్న గాల్వన్‌ లోయలో కూడా కొందరు సైనికులు పడిపోయారు.

కల్నల్ సంతోష్ బాబు సహా 20మంది వీర మరణం:
ఎముకలు కొరికే చలి, హైపోథెర్మియాతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 గాల్వన్, ష్యోక్‌ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. ఈ ఘ‌ర్ష‌ణ‌లో క‌ల్న‌ల్ సంతోష్ బాబు స‌హా 20మంది భార‌త సైనికులు అమరులయ్యారు. కాగా, భారత సైనికులు చైనాకి గట్టిగా బుద్ధి చెప్పారు. తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా ఎదురుదాడికి దిగారు. భారత దళాల ఎదురుదాడిలో చైనాకు భారీగానే ప్రాణ నష్టం జరిగింది. 43మంది చైనా సైనికులు చనిపోయినట్టు సమాచారం. ఈ రేంజ్ లో భారత జవాన్లు ఎదురు దాడికి దిగుతారని చైనా జవాన్లు అస్సలు ఊహించలేదట. భారత జవాన్ల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురు కావడంతో చైనా సైనికులు బిత్తరపోయారట. అందుకే తమవైపు జరిగిన భారీ ప్రాణనష్టం గురించి చైనా నోరు మెదపడం లేదని సమాచారం. కాగా, ఘర్షణలో గాయపడ్డ మరో నలుగురు భారత జవాన్ల పరిస్థితి విషమంగా మారడంతో ఇండో‌-చైనా బోర్డర్ లో యుద్ద వాతావరణం నెలకొంది.

Read: అయోధ్యలో రామమందిరం భూమి పూజ వాయిదా