భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి.. దాని బరువు, విలువ ఎంతో తెలుసా..? వేలంలో రికార్డు ధర.. అది భూమిపైకి ఎలా వచ్చిందంటే..
అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమిపై పడిన అత్యంత అరుదైన శిల (రాయి)ని వేలం వేశారు.

Mars Rock
Largest Mars rock found on Earth: అంగారక గ్రహం నుంచి దూసుకొచ్చి భూమిపై పడిన అత్యంత అరుదైన శిల (రాయి)ని వేలం వేశారు. ప్రఖ్యాత సోత్‌బీ వేలం సంస్థ న్యూయార్క్ లో వేలం వేయగా అది ఏకంగా రూ.37 కోట్లు (43లక్షల డాలర్ల) ధర పలికింది. తద్వారా సరికొత్త రికార్డును సృష్టించింది.
భూమిపై ఎక్కడ దొరికింది..
2023 నవంబర్ నెలలో ఆఫ్రికా ఖండంలోని నైగర్ దేశంలో దీనిని పురాతత్వ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. అంగారక గ్రహం నుంచి వచ్చిన ఈ రాయి.. 38.1 సెంటీమీటర్ల పొడవు, 24.5కేజీల బరువు ఉంది. ఈ శిలకు ఎన్‌డబ్ల్యూఏ 16788 అని పేరు పెట్టారు.
భూమిపైకి ఎలా వచ్చింది..?
ఈ రాయిని ఒక పెద్ద గ్రహశకలం అంగారక గ్రహం ఉపరితలం నుండి 140 మిలియన్ మైళ్ళు (225 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించి భూమిని చేరుకుంది. తోక చుక్క లేదా గ్రహశకలం భూవాతావరణం గుండా ప్రయాణించేటప్పుడు భూమి గురుత్వాకర్షణకు లోనవుతాయి. దాంతో తోకచుక్క కొనలోని చిన్నపాటి శిలలు లేదా గ్రహశకలంలోని చిన్న రాతి భాగాలు ఇలా భూమి మీద పడతాయి. అలా అంగారకుని నుంచి వచ్చిన ఒక గ్రహ కలంలోని చిన్న రాతి ముక్కే ఈ శిల.
భూమిపైకి ఇలా ఎన్నొచ్చాయి..
చరిత్రలో ఇప్పటిదాకా భూమిపై కేవలం 400 అంగారక శిలలే దొరికాయి. అవన్నీ చాలా చిన్నవి. ఇదొక్కటే పెద్దది. అందుకే వేలంలో ఇంత ధర పలికింది. భూ ఉపరితలం 75శాతం సముద్ర జలాలతో నిండి ఉంది. సముద్రంలో పడకుండా సహారా ఎడారిలో పడటం వల్లే మనకు ఇది దొరికిందని సోత్‌బీ సైన్స్, నేచరల్ హిస్టరీ విభాగ ఉపాధ్యక్షుడు కసాండ్రా హ్యాటన్ చెప్పారు.