Kamala Harris: నా పని అయిపోలేదు.. అమెరికా అధ్యక్ష పదవికి మళ్ళీ పోటీపై కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పైనా విమర్శలతో విరుచుకుపడ్డారు కమలా హారిస్. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ గురించి తాను చేసిన హెచ్చరికలు నిజమైనవేనని ఇప్పుడు ప్రూవ్ అయిందన్నారు.
Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీపై మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మనసులో మాటను బయట పెట్టారామె. అమెరికా అధ్యక్ష పదవి కోసం తాను మరోసారి పోటీచేసే అవకాశం లేకపోలేదన్నారు. అంతేకాదు తాను ఏదో ఒకరోజు దేశాధ్యక్షురాలిని అవ్వొచ్చని అన్నారు. భవిష్యత్తులో వైట్‌హౌస్‌లో ఓ మహిళ ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో కమలా హారిస్ మాట్లాడారు. అమెరికా అధ్యక్ష పదవి, ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పైనా విమర్శలతో విరుచుకుపడ్డారు కమలా హారిస్. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ గురించి తాను చేసిన హెచ్చరికలు నిజమైనవేనని ఇప్పుడు ప్రూవ్ అయిందన్నారు.డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఫాసిస్ట్‌లా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారన్న తన అంచనాలు నిజమయ్యాయన్నారు. న్యాయశాఖను ఆయుధంగా మలచుకుంటానని చెప్పారని, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కమలా హారిస్.. రాజకీయాల్లో ఇంకా భవిష్యత్తు ఉందని అన్నారు. తాను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదన్నారు కమలా హారిస్. తన కెరీర్ మొత్తాన్ని సేవలో గడిపానని, అది తన రక్తంలోనే ఉందని చెప్పారు.
వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి డెమొక్రాట్స్ తరపున ఆశావహుల రేసులో వెనుకంజలో ఉన్నారనే పోల్స్ అంచనాలపై కమలా హారిస్ స్పందించారు. తాను వాటిని పట్టించుకోనని అని అన్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌పై డెమొక్రట్ల తరపున కమలా హారిస్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Also Read: అద్దెకు సైన్యం..! డబ్బు కోసం దిగజారిన పాకిస్తాన్.. సౌదీతో కీలక ఒప్పందం వెనుక..
