Pakistan: అద్దెకు సైన్యం..! డబ్బు కోసం దిగజారిన పాకిస్తాన్.. సౌదీతో కీలక ఒప్పందం వెనుక..

వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్.. సౌదీ నుంచి పెట్టుబడి ప్యాకేజీ పొందనుంది.

Pakistan: అద్దెకు సైన్యం..! డబ్బు కోసం దిగజారిన పాకిస్తాన్.. సౌదీతో కీలక ఒప్పందం వెనుక..

Updated On : October 25, 2025 / 6:29 PM IST

Pakistan: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ రుణాల కోసం దిగజారిపోతోంది. డబ్బు కోసం దేనికైనా సిద్ధం అంటోంది. తాజాగా తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వడానికి కూడా పాక్ సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. తన ఆర్మీ సాయంతో నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది పాక్. సైనిక బలగాలను అద్దెకివ్వడం ద్వారా భారీగా నిధులు సమీకరించనున్నట్లు సమాచారం.

ఇటీవల పాకిస్తాన్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. తమపై ఎవరు దాడి చేసినా ఇరు దేశాలూ ఎదుర్కోవాలని నిర్ణయించాయి. పైకి ఇలా చెబుతున్నా.. అసలు మ్యాటర్ మరొకటి ఉందనే టాక్ వినిపిస్తోంది. పాకిస్తాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇస్తోందట. 25వేల మంది సైనికులను సౌదీకి పంపనుంది పాకిస్తాన్. ఇందుకు ప్రతిగా సౌదీ నుంచి 10 బిలియన్ డాలర్ల ప్యాకేజీని (రూ.88వేల కోట్లు) పాక్‌ అందుకోనుంది. పాక్ ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. రుణాల మీద రుణాలు తీసుకుంటోంది. అవీ సరిపోక ఇప్పుడీ అద్దె విధానాన్ని ఎంచుకుందన్న టాక్ వినిపిస్తోంది.

తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్.. సౌదీ అరేబియాతో మనీ ఫర్ సెక్యూరిటీ ఒప్పందం చేసుకుంది. కొత్తగా సంతకం చేయబడిన ఈ వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్.. సౌదీ నుంచి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీ పొందనుంది. అందుకు ప్రతిగా పాక్ తన సైన్యంలోని దాదాపు 25వేల మంది సైనికులను సౌదీలో మోహరించడానికి అంగీకరించింది.

సెప్టెంబర్ 17న రియాద్‌లో ప్రధాని షెహబాజ్ షరీఫ్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం.. ” ఇరు దేశాల్లో ఏ దేశంపైనైనా జరిగే ఏదైనా దురాక్రమణ ఇద్దరిపై జరిగే దురాక్రమణగా పరిగణించబడుతుంది”. అయితే, ఒప్పందం పూర్తి పాఠం బహిర్గతం కాలేదు. పాకిస్తాన్ అధికారుల నుండి వచ్చిన విరుద్ధమైన ప్రకటనలు ఇస్లామాబాద్ దేనికి సంతకం చేసిందనే దానిపై గందరగోళాన్ని మరింత పెంచాయి. మొత్తంగా నాటి రక్షణ ఒప్పందం ప్రకారం.. సౌదీకి బలగాల తరలింపునకు పాక్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందంలో భాగంగా పాక్ సైన్యం నుంచి కవచం, ఫిరంగిదళం, పదాతిదళం, రాకెట్ యూనిట్లతో కూడిన నాలుగు ఆర్మీ బ్రిగేడ్లు, రెండు వైమానిక దళ స్క్వాడ్రన్లు, రెండు నావికా దళాలను సౌదీలో మోహరించడం జరుగుతుంది. ఈ దళాలు సౌదీ అరేబియా అంతటా విస్తరించి ఒక లెఫ్టినెంట్ జనరల్ నేతృత్వంలో ఉంటాయి. వీరికి ఇద్దరు మేజర్ జనరల్స్, ఎనిమిది మంది బ్రిగేడియర్లు సాయం చేస్తారు.

ఈ సిబ్బంది సౌదీ సాయుధ దళాలతో ఉమ్మడి కార్యకలాపాలు, శిక్షణ, వ్యాయామాలలో పాల్గొంటారు. రియాద్‌కు వైమానిక రక్షణ, రాకెట్ కమాండ్ నిర్మాణాలను ఏర్పాటు చేయడంలో కూడా పాక్ సాయం చేస్తుంది.

Also Read: అయ్యయో.. టీ ఎంత పని చేసింది? 75లక్షలు పోగొట్టుకున్న వ్యాపారి.. కళ్ల ముందే..