Microsoft: ఇద్దరు మహిళా ఉద్యోగుల్ని తొలగించిన మైక్రోసాప్ట్ సంస్థ.. కారణం ఏమిటంటే?
: మైక్రోసాప్ట్ సంస్థ ఇద్దరు ఉద్యోగులను తొలగించింది. వారిలో భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు.

Ibtihal Aboussad and Indian American Vaniya Agrawal
Microsoft: మైక్రోసాప్ట్ సంస్థ ఇద్దరు ఉద్యోగులను తొలగించింది. వారిలో భారతీయ అమెరికన్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు. శుక్రవారం మైక్రోసాప్ట్ 50వ వార్షికోత్సవ కార్యక్రమం వాషింగ్టన్ లోని రెడ్‌మోండ్‌లో ఉన్న ప్రధాన కార్యాలయంలో జరిగింది. సంస్థ కన్జ్యూమర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ముస్తాఫా సులేమాన్ ప్రసంగిస్తున్న సమయంలో ఇబ్తిహాల్ అబోసాద్ అనే మహిళ నిరసన తెలుపుతూ అంతరాయం కలిగించింది.
ఇబ్తిహాల్ అబోసాద్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సైన్యానికి సాంకేతిక సాయం అందిస్తుండటాన్ని వ్యతిరేకించింది. ‘ముస్తఫా ఇది నీకు సిగ్గుచేటు.. మైక్రోసాఫ్ట్ చేతులకూ రక్తం అంటింది అంటూ నిరసన తెలిపింది. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తున్నామని చెబుతున్నారు.. కానీ, మైక్రోసాఫ్ట్ ఇజ్రాయెల్ ‘సైన్యానికి కృత్రిమ మేథ ఆయుధాలను అందించింది. వెంటనే ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని తమ కస్టమర్ల జాబితా నుంచి తీసివేయాలని ఆమె మైక్రోసాప్ట్ సంస్థను డిమాండ్ చేసింది. దీంతో ఆమెను సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపించారు.
కొద్దిసేపటి తరువాత.. మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెంళ్ల, మాజీ సీఈవోలు బిల్ గేట్స్, స్లీవ్ బాల్మెర్ లు వేదికపై ఉన్న సమయంలో వానియా అగర్వాల్ అనే మరో మహిళా ఉద్యోగిని తన నిరసన వ్యక్తం చేసింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమానికి అంతరాయం కలిగించింది. దీంతో ఆమెనుసైతం సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపించారు.
కార్యక్రమానికి అంతరాయం కలిగించిన ఇబ్తిహాల్ అబోసాద్, వానియా అగర్వాల్ ను మైక్రోసాప్ట్ సంస్థ విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయించింది. అబొసాద్ కు టర్మినేషన్ లేఖను పంపారు. ప్రవర్తన సరిగా లేదని మైక్రోసాఫ్ట్ సంస్థ టెర్మినేషన్ లేఖలో పేర్కొంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి రాజీనామా చేయనున్నట్లు అగర్వాల్ పంపిన లేఖను తక్షణమే ఆమోదిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.