ఒకేచోట 2,500 ఏళ్ల క్రితం నాటి 59 మమ్మీలను గుర్తించిన పరిశోధకులు

Mummy coffin opened 2,500 years in Egypt : మమ్మీలు అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ఈజిప్టు దేశం. ఈజిప్టు దేశ చరిత్రలో మమ్మీలు ఒక భాగమైపోయాయి. నైలు నదీ పరివాహక ప్రాంతమైన ఈజిప్టు మమ్మీలకు ప్రసిద్ధి. ఇక్కడ వందల వేల ఏళ్లనాటి మమ్మీలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాగే మమ్మీలపై పరిశోధనలు చేసే సైంటిస్టులకు కొదవేలేదు. ఎంతో ఆసక్తిగా వాటిపై పరిశోధనలు చేస్తుంటారు.
తాజాగా గత శనివారం (అక్టోబర్ 3,2020)న పురావస్తు శాస్త్రవేత్తలు ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో 59 మమ్మీలను బయటకు తీశారు. సక్కారా అనేది ఈజిప్టులో అత్యంత పురాతన శ్మశానవాటిక. ఇక్కడ బయటపడిన ఈ మమ్మీలు సుమారు 2,500 ఏళ్ల క్రితానికి చెందినవిగా పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తలు శవపేటికలను బయటకు తీసి, అందులోని మమ్మీలు చెక్కుచెదరకుండా ఉండటాన్ని గమనించారు. ఆకాలంలోనే ఎంతో అత్యాధునికంగా ఈ మమ్మీలను భద్రపరిచినట్లుగా గుర్తించారు.
ఈ మమ్మీలు ఈజిప్టుకు చెందిన పూజారులతో పాటు ఇంకా ఇతర ప్రముఖులవిగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఈజిప్ట్ పర్యాటక, పురావస్తు మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అవి వైరల్‌గా మారాయి.
ఈజిప్టు పర్యాటకశాఖ తెలిపిన వివరాల ప్రకారం సైంటిస్టుల పరిశోధనలో భాగంగా మొదటివిడతగా సక్కారాలోని మూడు బావులలో 13 శవపేటికలను కనుగొన్నారు. అలా మొత్తం 59 శవపేటికలను సక్కారా ప్రాంతంలోనే కనుగొని వాటిని వెలికితీశారు. ఈ మమ్మీలను ఈజిప్టియన్ మ్యూజియానికి తరలించి, అక్కడ ప్రదర్శించనున్నారు.
కాగా పరిశోధకులు ఇంకా తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని మమ్మీలు లభ్యమవుతాయని భావిస్తున్నారు.