కరోనా వైరస్‌ను చంపుతుందని, బ్లీచింగ్ పౌడర్ తాగుతున్నారు

  • Published By: naveen ,Published On : August 28, 2020 / 11:39 AM IST
కరోనా వైరస్‌ను చంపుతుందని, బ్లీచింగ్ పౌడర్ తాగుతున్నారు

Updated On : August 28, 2020 / 12:13 PM IST

కరోనా వైరస్ కట్టడి కోసం అధికారులు కంటైన్ మెంట్ ఏరియాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న సంగతి తెలిసిందే. అలాగే పరిసరాలను పరిశ్రుభంగా ఉంచడం కోసం బ్లీచింగ్ చేయడం కామన్. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతూ కరోనాను సంహరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ ను బ్లీచింగ్ పౌడర్ చంపుతుందని నమ్మారో మరో కారణమో కానీ.. అక్కడి జనాలు ఏకంగా నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగేస్తున్నారు. బాటిళ్లు బాటిళ్లు మింగేస్తున్నారు. అమెరికాలోని నార్త్‌ టెక్సాస్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ కొందరు వ్యక్తులు బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన ద్రవాన్ని తాగడం కలకలం రేపింది.

బ్లీచ ద్రవం తాగితే శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ నశిస్తుందని దుష్ప్రచారం:
ఎవరికైనా కరోనా నిర్ధరణ అయితే వారి ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ సిబ్బంది బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్న విషయం తెలిసిందే. అయితే నార్త్‌ టెక్సాస్‌లో కొందరు బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రవం తాగడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన కరోనా కూడా నశిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారట. అక్కడి అమాయక ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మి బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన ద్రవం తాగుతున్నారు. దీంతో అస్వస్థతకు గురవుతున్నారు.

ఒక్క నెలలో 50మంది బ్లీచ్ తాగేశారు:
ఇలా ఆగస్టు నెలలో ఇప్పటి వరకు దాదాపు 50 మంది బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన ద్రవం తాగి అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇది తప్పుడు సమాచారం అని, దీన్ని నమ్మొద్దంటూ టెక్సాస్‌ పాయిజన్‌ సెంటర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. బ్లీచింగ్‌ పౌడర్‌ కరోనా వైరస్ ను చంపలేదు, నిర్మూలించ లేదని తేల్చి చెప్పారు. పైగా బ్లీచింగ్ ద్రవం తాగితే వాంతులు, విరేచనాలు, రక్తప్రసరణలో సమస్యలు, కాలేయం దెబ్బతినడం వంటివి జరుగుతాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణం కూడా పోవచ్చని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) వెల్లడించిందని తెలిపింది.
https://10tv.in/over-150-academicians-write-to-pm-modi-in-favour-of-conducting-neet-jee-exams/
బ్లీచ్ తాగితే ప్రాణాలకే ప్రమాదం:
మీడియా, ఇంటర్నెట్ ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. తమ బంధువులు, చుట్టు పక్కల వారు చెప్పారని, కొందరు బ్లీచింగ్ తాగేస్తున్నారు. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరం. ఇది మంచి ఐడియా కాదు. బ్లీచ్ కరోనా వైరస్ ను చంపలేదు. కనీసం నిరోధించ లేదు కూడా. దయచేసి బ్లీచ్ తాగొద్దు అని అధికారులు ప్రజలను వేడుకున్నారు. కొందరు బ్లీచ్ ను కలుపుకి తాగగా, మరికొందరు ఇళ్లలో వాడే క్లీనర్లను ద్రవంలో కలుపుకుని తాగారు. పాయిజన్ కంట్రోల్ కేంద్రాలు, బ్లీచ్ తయారీదారులు, నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. బ్లీచ్ తాగితే ప్రాణాలకే ప్రమాదం అని వార్నింగ్ ఇచ్చారు.

ప్రజల్లో అవగాహన పెంచాలి:
కరోనా వైరస్ ను చంపుతుందనే అప నమ్మకంతో టెక్సాస్ లోని జనాలు బ్లీచ్ ని తాగడం సెన్సేషనల్ గా మారింది. ఇది తెలుసుకుని అంతా విస్తుపోతున్నారు. వారి అమాయకత్వానికి జాలి పడుతున్నారు. కాగా, ఇలాంటి దుష్ప్రచారం చేసిన వారిని వెంటనే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి దుష్ప్రచారం ప్రబలకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.