ఉత్తరకొరియాలో కరోనా కలకలం, తొలి పాజిటివ్ కేసు నమోదు?, ఎమర్జెన్సీ ప్రకటించిన కిమ్

ఉత్తరకొరియాలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని కొన్ని దేశాల్లో ఉత్తరకొరియా ఒకటి. అలాంటి దేశంలో ఒక్కసారిగా కొవిడ్ కలకలం రేగింది. నార్త్ కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. నార్త్ కొరియాకు దక్షిణ సరిహద్దు ప్రాంతమైన కైసోంగ్ నగరంలో మొదటి పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తరకొరియా ప్రభుత్వం ఇంకా నిర్ధారించలేదు. ప్రభుత్వం అధికారికంగా నిర్ధారిస్తే కనుక, ఉత్తరకొరియాలో ఇదే తొలి కరోనా కేసు అవుతుంది.
సౌత్ కొరియా నుంచి నార్త్ కొరియాలోకి చొరబడ్డ వ్యక్తి:
తాజాగా కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరాడని తెలుస్తోంది. మూడేళ్ల క్రితం దక్షిణ కొరియాకు పారిపోయిన ఓ ఫిరాయింపుదారుడు జూలై 19న చట్టవిరుద్ధంగా దేశ సరిహద్దును దాటి ఉత్తరకొరియాలోకి తిరిగి వచ్చాడని.. అతడికి కరోనా సోకినట్లు తెలిసిందని నార్త్ కొరియన్ మీడియా తెలిపింది. అయితే దక్షిణ కొరియా మాత్రం సరిహద్దుల్లో అలాంటి ఘటన ఏమీ జరగలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కరోనా బాధితుడు క్వారంటైన్‌లో ఉండగా.. డాక్టర్లు అతన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారట. గడిచిన కొద్దిరోజుల్లో అతడు ఎక్కడెక్కడికి తిరిగాడు.? ఎవరిని కలిశాడు.? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారందరినీ కూడా క్వారంటైన్‌కు తరలించాలని దేశాధ్యక్షుడు కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఎమర్జెన్సీ ప్రకటన, లాక్ డౌన్ విధింపు:
ఈ ఘటనతో దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అలర్ట్ అయ్యాడు. ఎమర్జెన్సీ ప్రకటించాడు. సరిహద్దులను మూసివేయమని చెప్పడమే కాకుండా కైసోంగ్‌లో కఠిన లాక్ డౌన్ విధించాలని అధికారులను ఆదేశించాడు. పొలిట్ బ్యూరోతో అత్యవసరంగా సమావేశం అయ్యాడు. పరిస్థితులపై వారితో చర్చించాడు.ఈ మేరకు స్థానిక అధికారిక మీడియా వెల్లడించింది.
జాగ్రత్త, లేదంటే పెద్ద ప్రమాదంలో పడతాం:
ఇప్పటివరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకొచ్చిన కిమ్.. తాజాగా పాజిటివ్ కేసు నమోదైందనే సమాచారంతో అలర్ట్ అయ్యాడు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశాడు. ”చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతాం. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టండి” అని కిమ్ ఆదేశించారు.
మిలటరీ అధికారులతో విచారణకు ఆదేశం:
నార్త్ కొరియా ఇప్పటికే రష్యా ఇతర దేశాల నుంచి వేల సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షల కిట్లు తెప్పించుకుంది. దేశ సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు విధించింది. దేశంలోకి కరోనా వైరస్ చొరబడకుండా కిమ్ కఠిన చర్యలు తీసుకున్నారు. చాలా జాగ్రత్తపడ్డారు. దేశంలో వేలాది మంది ప్రజలను క్వారంటైన్ చేశారు. ఇటీవలే నిబంధనలను కాస్త సడలించారు. కాగా, సదురు వ్యక్తి బోర్డర్ ను దాటి వచ్చిన ఘటనపై కిమ్ సీరియస్ అయ్యాడు. దీనిపై మిలటరీతో అధికారులతో విచారణకు ఆదేశించాడు. ఏ ప్రాంతంలో అయితే ఈ ఘటన జరిగిందో అక్కడ విధుల్లో ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కోటిన్నర కరోనా కేసులు, 6లక్షల మరణాలు:
డిసెంబర్ 2019 లో కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. కొన్ని వారాల తర్వాత కొవిడ్-19 అని పిలవబడే అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారింది. శ్వాసకోశ అనారోగ్యానికి దారితీసే ఈ వైరస్ ఇప్పుడు కనీసం 200కు పైగా దేశాలకు విస్తరించింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సమాచారం ప్రకారం కోటిన్నరకు పైగా మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల మంది మరణించారు.
ఒక్క కరోనా కేసూ లేని 12 లక్కీ దేశాలు ఇవే:
కొవిడ్-19 ధాటికి యావత్ ప్రపంచం గడగడలాడుతుంటే, కొన్ని దేశాలు మాత్రం దాన్ని తమ గడ్డమీదకు అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఆ దేశాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇవన్నీ పేరుకు దేశాలే కానీ, దాదాపు అన్నీ బుల్లి బుల్లి ద్వీపాలే. పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉండటం వల్ల సహజంగానే ఐసోలేషన్‌లో ఉంటాయివి. దాంతో పాటు ఇవి తీసుకున్న చర్యలూ వైరస్‌ను నిలువరించగలిగాయి. జులై 20 నాటికి ఒక్క కోవిడ్-19 కేసూ నమోదవ్వని దేశాలు 12 ఉన్నాయి.
1.ఉత్తర కొరియా
2.తుర్క్ మెనిస్తాన్
3.సోలొమన్ దీవులు
4.వనౌటు
5.సమోవా
6.కిరిబాటి
7.ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనీషియా
8.టోంగా
9.మార్షల్ దీవులు
10.పలావు
11.టువాలు
12.నౌరు