Karachi Hindu Dharamshala : హిందూ ధర్మశాల కూల్చివేత నిలిపివేసిన పాక్ సుప్రీంకోర్టు

పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని 1932లో నిర్మించబడిన ఓ హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేయాలంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Karachi Hindu Dharamshala : హిందూ ధర్మశాల కూల్చివేత నిలిపివేసిన పాక్ సుప్రీంకోర్టు

Pak Sc

Updated On : June 14, 2021 / 9:03 PM IST

Karachi Hindu Dharamshala పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని 1932లో నిర్మించబడిన ఓ హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేయాలంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మైనార్టీల హక్కులపై 2014లో వెలువడిన తీర్పును అమలు చేయడానికి సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.

కరాచీ లోని సద్దార్ టౌన్-1లో ప్రభుత్వం లీజుకు ఇవ్వదల్చుకున్న 716 స్కేర్ యార్డుల ఈ స్థలం ఒక ధర్మశాలకు సంబంధించినదని విచారణ సందర్భంగా మైనార్టీ కమిషన్ సభ్యుడు రమేశ్ కుమార్ కోర్టుకి నివేదించారు. అందులోని ధర్మశాల భవంతికి సంబంధించిన ఫోటోలను కూడా కోర్టుకు సమర్పించారు. పాక్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎవాక్యూ ట్రస్ట్ ప్రోపర్టీ బోర్డు (ఈటీపీబీ) ఈ స్థలాన్ని ఓ ప్రైవేట్ వ్యక్తికి లీజుకు ఇచ్చిందని, అతను ధర్మశాలను కూల్చి కమర్షియల్ బిల్డింగ్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడని రమేశ్ కుమార్ ధర్మాసనానికి వివరించారు. కాగా, దేశ విభజన సమయంలో పాకిస్తాన్ విడిచి వెళ్లిన హిందువులు, సిక్కుల విద్యా, స్వచ్ఛంద, మత సంస్థల ట్రస్టులు సహా అన్ని ఆస్తులను ఈటీపీబీ పర్యవేక్షిస్తుంది.

అయితే ఈ భవనాన్ని 1932లో నిర్మించినట్టుగా ఫొటోలను బట్టి తెలుస్తోందని, అది కచ్చితంగా వారసత్వ సంపద కిందికే వస్తుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఈ బిల్డింగ్ కు సంబంధించి రిపోర్ట్ సమర్పించాలంటూ సింధ్ హెరిటేజ్ సెక్రటరీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈలోపు ధర్మశాల భవనాన్ని ఎవరూ కూల్చవద్దనీ, అందులోకి ఎవర్ని ప్రవేశించకుండా చూడాలని సింధ్ కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.