Shehbaz Sharif: మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ కు స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఏమన్నాడంటే?
పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Pak PM Shehbaz Sharif
Shehbaz Sharif: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ ఆరోపిస్తుంది. ఈ మేరకు ఆధారాలనుసైతం సేకరించినట్లు తెలుస్తోంది. అయితే, ఉగ్రదాడి ఘటన తరువాత బిహార్ లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పాకిస్థాన్ కు పరోక్షంగా తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఎక్కడ దాక్కున్నా పట్టుకొస్తామని, వారికి సహకరించిన వారిని వదిలిపెట్టం అంటూ పాకిస్థాన్ పై ప్రధాని మోదీ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్ కు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు.
ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్.. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలపై మాట్లాడారు. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది.. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ షరీఫ్ పేర్కొన్నారు. మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం.. ఎలాంటి ముప్పును ఎదుర్కోవడానికైనా సింసిద్ధంగా ఉన్నామని చెప్పారు.. అదే సమయంలో.. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ కూడా ఖండిస్తుందని, శాంతికే మా ప్రాధాన్యం అంటూ శాంతి వచనాలను షరీఫ్ వల్లెవేశారు.
సింధూ జలాల ఒప్పందం నిలిపివేతపై షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ‘‘భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదు.. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’’ అంటూ షెహబాజ్ షరీఫ్ భారత్ ను నిందించే ప్రయత్నం చేశారు.