BAPS Temple : అబుదాబిలో మోదీ ప్రారంభించబోయే హిందూ దేవాలయం ప్రత్యేకతలు ఏంటి ?
అరబ్ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం కానుంది.

PM Modi to inaugurate UAE's first Hindu Temple
PM Modi- BAPS Temple : మన దేశంలోని అయోధ్యలో బాలరాముడి భవ్య రామమందిర ప్రారంభం ఘట్టం అట్టహాసంగా జరిగింది. ఇప్పుడు అలాంటిదే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అయితే అది మన దేశంలో కాదు.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి నగరంలో. అవును.. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ పేరుతో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది.
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం దేశం మొత్తం ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లింది. దేశమంతా ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. ఇప్పుడు మన దేశం బయట అదీ .. అరబ్ దేశంలో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ చేతులమీదుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ పేరుతో అతిపెద్ద హిందూ దేవాలయం ప్రారంభం కానుంది.
బాప్స్ స్వామినారాయణ్ సంస్థ అబుదాబిలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలున్నాయి. దుబాయ్-అబుదాబి మార్గంలో 27 ఎకరాల్లో 55 వేల చదరపు మీటర్ల పరిధిలో దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇది భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయం. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2 వేల మందికి పైగా శిల్పులు, కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అరబ్ దేశం ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని వినియోగించారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు.
Florida Plane Crash : హైవేపై కుప్పకూలిన విమానం.. కూలిపోతున్న సమయంలో తీసిన వీడియో వైరల్
402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విధ్వాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు. రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు జగన్నాథుడు, స్వామి నారాయణుడు, వేంకటేశ్వరుడు, అయ్యప్ప స్వామి కథలను ఈ స్తంభాలపై వర్ణించారు.
ఈ ఆలయం దిగువ భాగంలో పవిత్ర గంగా, యమునా నదీ ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాటర్ ఫీచర్లు, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు, గిఫ్ట్ షాపులు ఉంటాయి. మందిర్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది. భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వంటి వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటాను సేకరిస్తాయి. ఆలయం నిర్మాణానికి 40 వేల క్యూబిక్ ఫీట్ల పాల రాయి, లక్షా 80 వేల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు. ఇక్కడ ఇంకో విశిష్టత కూడా ఉంది. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర త్రీడీ విధానంలో ఏక శిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు. ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తూ అయోధ్య రాముడిని దర్శించుకున్న భావన కలగనుందని చెబుతున్నారు.
యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణానికి 2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా దీన్ని పింక్ శాండ్ స్టోన్‌తో సంప్రదాయ, ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మించారు. యూఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని తీసుకెళ్లి నిర్మాణంలో ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌కు క్యాన్సర్.. కారణం కోహినూర్ శాపమేనా?
అరబ్ దేశాల్లోనే ఈ దేవాలయమంత పెద్దది మరొకటి లేదు. దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం ఫిబ్రవరి 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది.