నా రూటే సపరేటు : షట్ డౌన్ రికార్డు కూడా ట్రంప్ దే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఖాతాలో మరో రికార్డు వేసుకొన్నారు. అమెరికాలో షట్ డౌన్ ఆదివారానికి 23వ రోజుకి చేరుకొంది. అమెరికాలో సుదీర్ఘకాలం షట్ డౌన్ కొనసాగడం ఇదే మొదటిసారి. 1995-96లో బిల్ క్లింటన్ హయాంలో 21 రోజులు షట్ డౌన్ కారణంగా ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. మెక్సికో సరిహద్దులో గోడ కట్టే విషయమై ట్రంప్, ప్రతిపక్ష డెమోక్రాట్ల మధ్య మొదలైన వివాదం కారణంగా దేశంలో ఆర్థిక ప్రతిష్ఠంభన నెలకొని నేటితో 23 రోజులు.
షట్ డౌన్ కారణంగా దేశంలోని సుమారు ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం తరపు నుంచి చెల్లించాల్సిన బిల్లులు అందడం లేదు. డెమోక్రాట్ల చర్యలకు ప్రతీకారంగా ఇతర విభాగాల బడ్జెట్ పై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించడంతో రాజధాని వాషింగ్టన్ స్థంభించిపోయింది. అయితే తన మాట నెగ్గకుంటే దేశంలో ఎమర్జెన్సీ విధించేందుకు కూడా వెనుకాడబోనని డెమోక్రాట్లను ట్రంప్ హెచ్చరించారు.