రెండో కరోనా వ్యాక్సిన్ “ఎపివాక్” కు రష్యా ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2020 / 06:35 PM IST
రెండో కరోనా వ్యాక్సిన్ “ఎపివాక్” కు రష్యా ఆమోదం

Updated On : October 15, 2020 / 7:22 PM IST

Russia approves 2nd coronavirus vaccine ప్రపంచంలోనే తొలిసారిగా ఆగస్టు నెలలో స్పుత్నిక్ వీ పేరుతో కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన రష్యా..ఇప్పుడు మరో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి చేసింది. బుధవారం…తన రెండో కరోనా వ్యాక్సిన్ “ఎపివాక్” కు రష్యా అధికారుల నుంచి రెగ్యులేటరీ అఫ్రూవల్ లభించింది. కరోనా వైరస్‌ సోకకుండా ఈ వ్యాక్సిన్‌ ఆరు నెలలపాటు అండుకుంటుందని రష్యా పేర్కొంది.



రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం టీవీ ముఖంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ… రెండు కరోనా వ్యాక్సిన్ లు(స్పత్నిక్-వీ,ఎపివాక్) ఉత్పత్తిని పెంచనున్నట్లు తెలిపారు. రష్యా శాస్త్రవేత్తలు కనుగొన్న రెండు వ్యాక్సిన్‌ డోస్‌లను ఉత్పత్తి చేస్తామని, వాటిని ముందుగా దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రాధాన్యతనిస్తామని ఆయన చెప్పారు.



ఈ కొత్త కరోనా వ్యాక్సిన్ ను సిబేరియాలోని వెక్టార్ స్టేట్ రీసెర్ట్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ డెవలప్ చేసింది. రెండు వారాల క్రితం ఈ వ్యాక్సిన్ ప్రారంభదశ క్లినికల్ ట్రియిల్స్ పూర్తయ్యాయి. ప్రారంభదశలో రెండు నెలలపాటు 18-60ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 100 మంది వాలంటీర్లపైన హ్యూమన్ ట్రయిల్స్ జరిపిన అనంతరం ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రష్యా ప్రభుత్వం అనుమతివ్వడం గమనార్హం. ఈ వ్యాక్సిన్ స్టడీకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయకుండానే ఈ వ్యాక్సిన్‌ ఆరు నెలల పాటు కరోనాను అడ్డుకుంటుందని పుతిన్ సర్కార్ ప్రకటించింది.

ఎపివాక్ కరోనా వ్యాక్సిన్…రెండవ దశ హ్యూమన్ ట్రయిల్స్ నవంబర్-డిసెంబర్ మధ్యలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 30వేల మంది వాలంటీర్లు పాల్గొనబోతున్నట్లు సమాచారం. హ్యూమన్ ట్రయిల్స్ నిర్వహించేందుకు జులై నెలలోనే వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ కు రష్యా ఆరోగ్యమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది.



కాగా, రష్యా తొలి కరోనా వ్యాక్సిన్‌ స్పత్నిక్-వీ కు ఆగస్టు- 11న ప్రభుత్వం అనుమతించి లభించిన విషయం తెలిసిందే. ఇక,ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువున్న దేశాల్లో రష్యా నాలుగవ దేశం. ఇంతవరకు అక్కడ 13 లక్షల మంది వైరస్‌ బారిన పడగా 23 వేల మంది మరణించారు.