Russia Ukraine War: 600 డ్రోన్లు, 26 మిస్సైళ్లు.. యుక్రెయిన్ పై రష్యా భీకర దాడులు.. రాత్రి పూట పెను విధ్వంసం..
ఈ యుద్ధాన్ని ఆపేలా రష్యాకు గట్టి హెచ్చరికలు పంపాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ పాశ్చాత్య మిత్రదేశాలకు పిలుపునిచ్చారు.

Russia Ukraine War: రష్యా, యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ పై మరోసారి రష్యా భీకర దాడులు చేసింది. డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేసింది. రాత్రంతా దాడులు కొనసాగించింది. 600 డ్రోన్లు, 26 క్షిపణులతో యుక్రెయిన్ పై దాడి చేసింది రష్యా. పశ్చిమ యుక్రెయిన్ లక్ష్యంగా దాడులకు తెగబడింది రష్యా.
శనివారం రాత్రి పశ్చిమ యుక్రెయిన్‌పై రష్యా 600 కి పైగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఆర్మీ రిక్రూట్ మెంట్ సెంటర్లు, సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు. 2022 ఫిబ్రవరిలో రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధాన్ని ఆపేలా రష్యాకు గట్టి హెచ్చరికలు పంపాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ పాశ్చాత్య మిత్రదేశాలకు పిలుపునిచ్చారు.
రష్యా రాత్రి సమయంలో 597 డ్రోన్లు, 26 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని యుక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. రష్యా ప్రయోగించిన వాటిలో 319 షాహెద్ డ్రోన్లు, 25 క్షిపణులను కూల్చివేసినట్లు యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ’26 క్రూయిజ్ క్షిపణులు, 597 డ్రోన్లను ప్రయోగించారు. వాటిలో సగానికి పైగా ఇరాన్ నిర్మిత షాహెద్‌లు ఉన్నాయి” అని జెలెన్ స్కీ వెల్లడించారు. ”రష్యా వైమానిక దాడులపై త్వరిత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంక్షల ద్వారా ఈ దాడులను అడ్డుకోవచ్చు” అని ఆయన అన్నారు.
అంతేకాదు రష్యా డ్రోన్లను ఉత్పత్తి చేయడానికి, చమురు నుండి లాభం పొందడానికి సాయం చేసే వారిని శిక్షించాలని ప్రత్యేకంగా కోరారు. కాగా, ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో రష్యా భీకర దాడులు చేయడం ఉద్రిక్తతలను పెంచింది.