Divorce : కథ అడ్డం తిరిగింది.. రెండో భార్యను జైలుకు పంపిన భర్త

భర్త ప్రేమ తనకే సొంతం కావాలనే స్వార్థంతో రెండవ భార్య చేసిన పని భర్తను తీర్వ మనోవేదనకు గురి చేసింది. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లిన భర్త.. భార్యకు జైలు శిక్ష వేయించాడు.

Divorce : కథ అడ్డం తిరిగింది.. రెండో భార్యను జైలుకు పంపిన భర్త

Divorce

Updated On : August 29, 2021 / 3:35 PM IST

Divorce : చాలా దేశాల్లో రెండవ వివాహం చేసుకోవడం చట్టరీత్య నేరం. అయితే మొదటి భార్య అనుమతితో రెండు వివాహం చేసుకునే అవకాశం ఉంది. ఆలా మొదటి భార్య అనుమతితో రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి రెండవ భార్య షాక్ ఇచ్చింది. మొదటి భార్యను భర్త నుంచి వేరు చేసింది.

వివరాల్లోకి వెళితే.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) చెందిన ఓ వ్యక్తి మొదటి భార్య అనుమతి తీసుకోని రెండవ వివాహం చేసుకున్నాడు. ఇరువురిని చెరోచోట పెట్టి చక్కగా చూసుకుంటున్నాడు. అయితే రెండో భార్యకి కొంచెం స్వార్థం ఎక్కువ. తన భర్త తన సవతికి దగ్గరవ్వడం ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. దాంతో ఆమె అతడికి తెలియకుండా, అతడి ఫోన్‌ రహస్యంగా తీసుకుని మొదటి భార్యతో అతడు చేసిన చాటింగ్‌ మొత్తం చదివేది.

అతడి ఈ–మెయిల్స్‌ కూడా తెరిచి చూసేది. కొన్ని మెసేజులకు కోపం తెప్పించేలా రిప్లైలు ఇచ్చేది. భర్త చాట్ చేస్తున్నట్లు భావించిన మొదటి భార్య ఆ మెసేజిలు చూసి విరక్తి చెందేది. ఇంతకాలం మంచిగా ఉన్న భర్త రెండవ భార్య రావడంతో తనను దూరం చేయడం మొదలు పెట్టాడని అనుకోని విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.

ఊహించని ఈ ఘటనతో అతడు మానసికంగా కుంగిపోయాడు. అంతటికీ కారణం తన రెండో భార్య అని తెలుసుకొని కోర్టును ఆశ్రయించాడు. తనకు తెలియకుండా ఫోన్ తీసుకోని మొదటి భార్యతో చాటింగ్ చేసి ఆమెను దూరం చేసిందని కోర్టులో మొరపెట్టుకున్నాడు. రెండవ భార్య చేసిన పనికి.. ఆర్థికంగా చాలా నష్టపోయానని, చివరికి కోర్టు వ్యవహారాల్లో తలమునకలై ఉద్యోగం కూడా పోగొట్టుకున్నానని.. అన్ని ఖర్చుల నిమిత్తం పరిహారం ఇప్పించమని జడ్జిని దీనంగా వేడుకున్నాడు.

ఈ కేసును అల్ ఖైమా సివిల్ కోర్టు న్యాయమూర్తి దీనిని పరిశీలించి.. అతడి ప్రైవసీకి భంగం కలిగించేలా ప్రవర్తించారని రెండవ భార్యకు 8,000 దిర్హామ్‌లు అంటే సుమారు లక్ష అరవై నాలుగు వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. ఒక నెల రోజుల జైలు శిక్ష కూడా విధించారు. దీనికి తోడు కోర్టు ఖర్చుల నిమిత్తం 42 వేల జరిమానా విధించారు. భర్త ప్రేమ తనకే దక్కాలనే అక్కసుతో చేసిన పనికి సదరు మహిళ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.