బ్రిడ్జిని ఢీకొట్టిన ఓడ.. మధ్యలో కూలిన వంతెన.. ఇద్దరు దుర్మరణం
నదిపై ఉన్న బ్రిడ్జిని కార్గో షిప్ ఢీకొట్టిన దుర్ఘటనలో పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు.

Ship rams bridge plunging cars into river in China Guangzhou
Ship rams bridge: నదిపై ఉన్న బ్రిడ్జిని కార్గో షిప్ ఢీకొట్టిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. దక్షిణ చైనా నగరమైన గ్వాంగ్‌జౌలోని నాన్షా జిల్లాలో గురువారం జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారని.. ఒకరు గాయపడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదం ధాటికి బ్రిడ్జి మధ్యభాగం పూర్తిగా కూలిపోయింది. దీంతో పలు వాహనాలు పెర్ల్ నదిలోకి పడిపోయాయి.
ఫోషన్ నుంచి వచ్చి గ్వాంగ్‌జౌ వైపు ప్రయాణిస్తుండగా గ్వాంగ్‌జౌలోని లిక్సిన్ సీ బ్రిడ్జిని కార్గో షిప్ బలంగా ఢీకొట్టింది. బ్రిడ్జి మధ్యలో కూలిపోవడంతో బస్సుతో సహా ఐదు వాహనాలు నదిలోకి పడిపోయాయి. ప్రమాదానికి కారణమైన ఓడలో ఎలాంటి సరుకులు లేవని, అది వంతెన కింద ఇరుక్కుపోయింది. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న చైనా సెంట్రల్ టెలివిజన్ (CCTV)లో రికార్డయ్యాయి.
కాగా, ప్రమాదానికి కారణమైన ఓడ కెప్టెన్‌ను గ్వాంగ్‌జౌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా లిక్సిన్ సీ బ్రిడ్జి చుట్టుపక్కల నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక అధికారులు బీజింగ్ న్యూస్‌తో చెప్పారు. ప్రమాదాలు జరగకుండా వంతెనను పునర్మించాలని 2021లోనే ప్రావిన్షియల్ అధికారులు ప్రతిపాదించారు. బ్రిడ్జి పునరుద్ధరణ పనులు మూడుసార్లు వాయిదా పడినట్టు లోకల్ మీడియా వెల్లడించింది.
Also Read: ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండను చూశారా? 26 అడుగుల పొడవు, 200 కిలోల బరువు.. వీడియో
2019, జూలైలో వంతెనలోని బాక్స్ గిర్డర్ డామేజయినట్టు గుర్తించిన అధికారులు.. 15 టన్నులు లేదా అంతకంటే ఎక్కువ బరువున్న వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారని ది గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
#Breaking A cargo ship fractures a bridge in south #China‘s #Guangzhou, causing an unknown number of vehicles to plunge into the water on Thursday. pic.twitter.com/jfecoe7IYq
— Ifeng News (@IFENG__official) February 22, 2024