Blue Origin Mission: జెఫ్ బెజోస్ గర్ల్‌ఫ్రెండ్ సహా ఆరుగురు మహిళలు.. 11 నిమిషాల్లో అంతరిక్షంలోకి.. వాళ్లేం చేస్తారంటే..
విభిన్న రంగాలకు చెందిన ఆరుగురు మహిళలు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ ‘బ్లూ ఆరింజిన్’ తన న్యూ షెపర్డ్ రాకెట్ లో..

Blue Origin Mission
Blue Origin Mission: విభిన్న రంగాలకు చెందిన ఆరుగురు మహిళలు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ తన న్యూ షెపర్డ్ రాకెట్ లో ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపనుంది. మిషన్ ప్రయాణం కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దాని లోపల ఉన్న స్పేస్ క్రాఫ్ట్ పూర్తిగా ఆటోమేటెడ్. అంటే దీనిని ఆపరేట్ చేయడానికి లోపల ఎవరూ ఉండరు.
ఎవరెవరు వెళ్తున్నారు..?
ఏప్రిల్ 14న రాత్రి 7గంటలకు పశ్చిమ టెక్సాస్ లోని లాంచ్ సైట్ వన్ నుంచి న్యూషెపర్డ్ రాకెట్ లాంచ్ అవుతుంది. ఇందులో పాప్ సింగర్ కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్, పౌర హక్కుల న్యాయవాది అముంద గుమెన్, నాసా మాజీ శాస్త్రవేత్త అయోషా బోవ్, చిత్ర నిర్మాత కెరియాన్ ఫ్లిన్, రచయిత్రి జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్ లు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. లారెన్ సాంచెజ్ బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఆమె జెఫ్ బెజోస్ ప్రియురాలు కూడా. వీళ్లందరూ భూమికి, అంతరిక్షానికి మధ్య ఉన్న ఊహాత్మక సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటుతారు. 1963లో సోవియట్ కు చెందిన మహిళా కాస్మోనాట్ వాలెంటినా తేరిష్కోవా సింగిల్ గా ప్రయాణించిన తరువాత జరుగుతున్న పూర్తి మహిళా అంతరిక్ష ప్రయాణం ఇదే.
11 నిమిషాల్లో అంతరిక్షంలోకి ఎలా..?
అంతరిక్షయాన సంస్థ బ్లూ ఆరిజిన్ కు చెందిన న్యూ షెపర్డ్ మిషన్ రాకెట్ కేవలం 11 నిమిషాల్లో అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. కర్మన్ రేఖ వద్ద వీరంతా కొన్ని నిమిషాలపాటు జీరో గ్రావిటీని అనుభవిస్తారు. అక్కడ అంతరిక్షం నుంచి కొద్దిసేపు భూ గ్రహాన్ని తిలకిస్తారు. ఇది కేవలం అంతరిక్ష యాత్ర కాదు.. ప్రజల ఆలోచనలను మార్చడం, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో జరిగే యాత్ర అని బ్లూ ఆరిజిన్ పేర్కొంది.
ఈ ప్రయాణం 11 నిమిషాలు ఉంటుంది. ఆరుగురు మహిళలు రాకెట్‌లో ఏడు నిమిషాలు ప్రయాణిస్తారు. దాదాపు 48 కిలో మీటర్లు దానిలో ప్రయాణించిన తర్వాత, రాకెట్ నుంచి స్పేస్ క్రాఫ్ట్ విడిపోయి అంతరిక్షంలోకి వెళుతుంది. స్పేస్‌క్రాఫ్ట్ కర్మన్ రేఖకు కొంచెం పైన ప్రయాణించి, తర్వాత భూమికి తిరిగి వస్తుంది.
కర్మన్ రేఖ అంటే ఏమిటి..?
ఆరు మహిళలతో వెళ్లే స్పేస్ క్రాప్ట్ కర్మన్ రేఖ వద్ద అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. అంటే భూ వాతావరణాన్ని దాటి అంతరిక్ష వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే.. కర్మన్ రేఖ అనేది ఒక ఊహాత్మక సరిహద్దు. దీనిని భూమిపై సముద్ర మట్టానికి 100 కిలో మీటర్ల ఎత్తులో ఉన్నట్లు పేర్కొంటారు. కర్మన్ రేఖ అనేది అంతరిక్షానికి ప్రారంభ స్థానం. ఆ ప్రాంతం 99.9శాతం భూ వాతావరణం ముగిసే ప్రాంతం. భూ వాతావరణం, బాహ్య అంతరిక్షం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి ఎఫ్ఏఐ అనే సంస్థ ఈ కర్మన్ రేఖను నిర్ణయించింది. ఆరుగురు మహిళలు కర్మన్ రేఖను దాటి అక్కడి నుంచి కొద్ది నిమిషాల పాటు భూ గ్రహాన్ని తిలకిస్తారు.