TANA: తానా నెల నెలా తెలుగు వెలుగు.. కథాసాహిత్యం విజయవంతం
తానా ప్రపంచ సాహిత్య వేదిక.. నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కథాసాహిత్యం విజయంతంగా జరిగింది.

TANA Nela Nela Telugu Velugu
TANA Nela Nela Telugu Velugu డల్లాస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సంస్థ సాహిత్యవిభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” (TANA Prapancha Sahitya Vedika) నెల నెలా తెలుగు వెలుగులో భాగంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలంలో నిర్వహిస్తున్న కార్యక్రమ పరంపరలో జూన్ 25న నిర్వహించిన “కథాసాహిత్యం” విజయంతంగా జరిగింది. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి (Anjaiah Chowdary Lavu).. ప్రజలపై కథల ప్రభావం ఎంతో ఉందని, సామాజిక ప్రయోజనం కల్గించే కథలు మరిన్ని రావాలని ఆకాంక్షిస్తూ, అతిథులను స్వాగతిస్తూ సభను ప్రారంభించారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా విభిన్న సాహిత్య అంశాల మీద అంతర్జాలంలో జరుపుకుంటున్న ఈ 56వ సమావేశం యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) లాంటి సుప్రసిద్ధ రచయితలు పాల్గొనడం ఆనందదాయకం అని తానా ప్రపంచసాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ (Chigurumalla Srinivas) అన్నారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర (Prasad Thotakura) మాట్లాడుతూ.. ఉగ్గుపాలతో కథలు విన్న పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, దానికి పునాదులు వేయవలసింది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులే అని అన్నారు. బాల్యంలో కథలు విన్న పిల్లల మానసిక వికాసం, పరిపక్వత తెలుగు భాషపట్ల పసితనంలోనే అనురక్తి కలిగి పెరిగి పెద్దైన తర్వాత వారే భాషా ప్రేమికులుగా, సాహితీవేత్తలుగా రూపాంతరం చెందుతారన్నారు.

TANA Nela Nela Telugu Velugu
యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ.. “కథారచయితలు సమయం తీసుకుని, ఆలోచించి కథలు రాస్తే వాటిని చదివే పాఠకులను అవి ఆలోచింపజేస్తాయి. వేగంగా కథలు రాయడం తనవల్ల కాదని, ఒక కథ రాయాలంటే ఎన్నో నెలల నిరంతర మేదోమధనం, ఎన్నో సవరణలతో తనకు పూర్తిగా నచ్చిన తర్వాతే ఆ కథ వెలుగులోకి వస్తుందని చెప్పారు. వర్ధమాన రచయితలు సామాజిక ప్రయోజనం కలిగించే కథావస్తువులను ఎంచుకొని రచనలు చేయడం చాలా అవసరమ”న్నారు.
విశిష్ట అతిథులుగా పాల్గొన్న అయ్యగారి వసంతలక్ష్మి తన ప్రత్యేకమైన గళానుకరుణతో ప్రఖ్యాత రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి రాసిన “సుఖాంతం” కథను హృద్యంగా వినిపించారు. ప్రముఖ కథారచయిత విహారి కాలానుగుణ అంశాలు అనే అంశంపై ప్రసంగిస్తూ రచయితలు కథాంశాన్ని ఎన్నుకునేటప్పుడు అది ఆ తరాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలన్నారు. సుప్రసిద్ధ కథారచయిత ద్విభాష్యం రాజేశ్వర రావు తాను చిన్నప్పటి నుంచే కథలు వినడం, అనేకమంది సాహితీవేత్తల సమక్షంలో తన జీవితం గడవడంవల్ల తన కథానేపథ్యం ప్రారంభమైందన్నారు.
Also Read: జులై మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు
ఎన్నో కథల పోటీలలో పాల్గొని శతాధిక బహుమతులు పొందిన సుప్రసిద్ధ రచయిత సింహ ప్రసాద్ మాట్లాడుతూ పోటీలో పాల్గొని బహుమతులు పొందాలంటే ఎంచుకునే కథాంశం మీద ధ్యాస, నియమ నిబంధనల మీద దృష్టి సారించాలని, మంచి కథకు ప్రమాణం కేవలం బహుమతి పొందడమే కాదని, బహుమతి పొందని కథలలో కూడా ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయన్నారు. ప్రముఖ హాస్యకథారచయిత్రిగా పేరు సంపాదించుకున్న పొత్తూరి విజయలక్ష్మి తాను రాసిన హాస్యకథలతోపాటు ఎంతోమంది హాస్యకథ రచయితలు రాసిన విషయాలను ప్రస్తావించి సభలో నవ్వులు పూయించారు. ప్రసిద్ధ కథారచయిత శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రతి కథ ఒక సామాజిక ప్రయోజనం కలిగి ఉండి, మానవ సంబంధాలను మెరుగుపరచడంలో ముఖ్యభూమికను పోషిస్తూ, మానవీయకోణం కలిగి ఉన్నప్పుడే ఆ కథ పదికాలాల పాటు శాశ్వతంగా నిలుస్తుందన్నారు.
Also Read: న్యూయార్క్ లో దీపావళి రోజున స్కూల్స్ కు సెలవు
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, బాల సాహిత్యంలో శతాధిక రచనలు చేసిన చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ పిల్లలకు కథలు చెప్పడం చాలా అవసరమని, అది ఒక సాహసం అని, వారికి చెప్పే కథాంశం, చెప్పేతీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవి వారి మానసికపరిణితికి బాగా ఉపయోగపడతాయన్నారు. ఈ సాహిత్యసభలో పాల్గొని విజయవంతంచేసిన అతిథులకు, ప్రసారం చేసిన మాధ్యమాలకు, కార్యకర్తలకు, తానా సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసింది.