On Line Classes : ఆన్‌లైన్ క్లాసు చెపుతున్నప్పుడు పిల్లి కనపడిందని టీచర్ ఉద్యోగం ఊడింది
ఆన్‌లైన్‌లో పాఠాలు చెపుతున్నప్పుడు ఒక టీచర్ ఇంట్లో పెంపుడు పిల్లి ఆన్ లైన్ లో కనిపించిందని చైనాకు చెందిన ఒక ఎడ్ టెక్ కంపెనీ ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసింది.

china teacher on line classes
On Line Classes : ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో అనేక కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. పిల్లలకు పాఠాలు కూడా ఆన్ లైన్ లోనే బోధించిన సంగతి తెలిసిందే. అలా ఆన్‌లైన్‌లో పాఠాలు చెపుతున్నప్పుడు ఒక టీచర్ ఇంట్లో పెంపుడు పిల్లి ఆన్ లైన్ లో కనిపించిందని చైనాకు చెందిన ఒక ఎడ్ టెక్ కంపెనీ ఆ టీచర్ ఉద్యోగాన్ని తీసేసింది.
వివరాల్లోకి వెళితే చైనాలోని గాంగ్‌ఝో లో నివసించే లూవో అనే ఆర్ట్ టీచర్ ఒక ఎడ్ టెక్ కంపెనీలో ఆన్ లైన్ లో పిల్లలకు డ్రాయింగ్ బోధిస్తున్నాడు. ఇంతలో ఇంట్లోని ఆయన పెంపుడు పిల్లి ల్యాప్ టాప్ కెమెరా ముందుకు దూకింది. ఇలా నాలుగైదు సార్లు జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఎడ్ టెక్ కంపెనీ లూవోను ఉద్యోగంలోంచి తీసేసింది. ఈ నిర్ణయాన్ని అతడు ఆర్బిట్రేషన్‌లో సవాల్ చేయగా.. లువోకు నష్టపరిహారం చెల్లించాలని కమిటీ సదరు కంపెనీని ఆదేశించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆ ఎడ్‌టెక్ కంపెనీ కోర్టులో పిటీషన్ వేసింది.
లువో ప్రవర్తన ‘టీచర్ కోడ్ ఆఫ్ కండక్ట్’కు విరుద్ధంగా ఉందని, క్లాస్ కు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని…క్లాస్ టైంలో వేరే పనులు చేశారని ఆ సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు కూడా కమిటీ నిర్ణయాన్నే సమర్థించి.. లువోకు రూ.4.6 లక్షలు (40 వేల యువాన్లు) నష్ట పరిహారంగా చెల్లించాలని తేల్చిచెప్పింది.
కరోనా కష్టకాలంలో ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు ఇలాంటివి సహజమని, ఇంటిని ఆఫీసుతో పోల్చలేమని పేర్కొంది. యజమాని నియమాలు చట్టాలకు లోబడి ఉండటమే కాకుండా న్యాయంగా సహేతుకంగా కూడా ఉండాలని కోర్టు పేర్కోంది. ఈ ఘటన ఈ ఏడాది జూన్ లో జరిగినట్లు స్ధానిక పత్రికలు పేర్కోన్నాయి.
Also Read : Satya Pal Malik on MSP: ప్రధాని మోదీపై మరోసారి విరుచుకుపడ్డ మేఘాలయ గవర్నర్