ఎదురు డబ్బులిస్తాం.. అమెరికా నుంచి వెళ్లిపోండ్రా బాబూ అంటున్న ట్రంప్.. అక్రమ వలసదారులకు ఆఫర్.. ఎంతిస్తారంటే..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక.. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే.

ఎదురు డబ్బులిస్తాం.. అమెరికా నుంచి వెళ్లిపోండ్రా బాబూ అంటున్న ట్రంప్.. అక్రమ వలసదారులకు ఆఫర్.. ఎంతిస్తారంటే..

Donald Trump

Updated On : May 6, 2025 / 12:53 PM IST

ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ లేకపోయినా ఇప్పటికీ అమెరికాలోనే ఉంటున్న వారిని యూఎస్‌ నుంచి పంపించేయడానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో ప్లాన్ వేశారు. స్వచ్ఛందంగా అమెరికాను వీడి సొంత దేశానికి వెళ్లేవారికి ప్రోత్సాహకంగా రూ.84,445 ($1,000) ఇస్తామని చెప్పారు. డిపార్ట్‌మెట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) తాజాగా ఈ ప్రకటన చేసింది.

సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు యూఎస్‌ విడిచి వెళ్లడానికి సీబీపీ హోమ్ అనే యాప్‌ ద్వారా అప్లై చేసుకుంటే ఆర్థిక సాయంతో పాటు వారి ప్రయాణానికి కూడా సాయం చేస్తారు.

ఒకే యాప్‌ని అప్పుడు అలా వాడారు.. ఇప్పుడు ఇలా..
ఈ యాప్‌ పేరు మొదట CBP One అని ఉండేది. జో బైడెన్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీన్ని తీసుకొచ్చారు. CBP One యాప్‌ను చట్టబద్ధంగా అమెరికాలోకి వచ్చే ప్రజలకు సాయపడడానికి రూపొందించారు.

అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద నుంచి వచ్చి వలసదారులు యూఎస్‌లో ఆశ్రయం పొందాలనుకుంటే వారు దరఖాస్తు చేసుకోవడానికి, చట్టబద్ధంగా రావడానికి ఈ యాప్‌ సాయపడేది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఈ యాప్‌ను వాడకుండా చేశారు.

Also Read: హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీల విలువ ఎన్ని వందల కోట్లంటే?

ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఈ పనిచేశారు. అనంతరం ఈ యాప్‌ పేరును మార్చేసి, దాన్ని వాడే తీరులో మార్పులు చేయించారు. ఈ యాప్‌కు ఇప్పుడు సీబీపీ హోమ్‌గా పేరు పెట్టారు. గతంలో ప్రజలు అమెరికాలోకి రావడానికి ఉపయోగించిన ఈ యాప్‌ను ఇప్పుడు యూఎస్‌ నుంచి ప్రజలను (అక్రమంగా ఉంటున్నవారిని) పంపించి వేయడానికి వాడుతున్నారు.

అక్రమ వలసదారులు అమెరికా నుంచి బయలుదేరి వారి సొంత దేశానికి చేరుకున్న తర్వాతే అమెరికా 1,000 డాలర్లను చెల్లిస్తుంది. సొంత దేశానికి చేరుకున్నామన్న విషయాన్ని ఈ యాప్ ద్వారా తెలపాల్సి ఉంటుంది.

డీహెచ్‌ఎస్ సెక్రటరీ క్రిస్టి నోయీమ్‌ మాట్లాడుతూ.. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారు అరెస్టు కాకుండా యూఎస్‌ నుంచి వెళ్లిపోవడానికి స్వచ్ఛందంగా వెళ్లడమే ఉత్తమమైన, సురక్షితమైన మార్గమని అన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక.. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వీసా రూల్స్‌ కూడా కఠినతరం అవుతున్నాయి. ఇప్పటికే పలు విమానాల్లో అమెరికా ప్రభుత్వం చాలా మందికి వారి సొంత దేశాలకు పంపింది.