US-China: జిన్‌పింగ్‌తో చర్చలు.. చైనాకు గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్..

US-China జిన్ పింగ్ తో భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ చైనాకు గుడ్ న్యూస్ చెబుతూ కీలక ప్రకటన చేశారు. చైనాపై సుంకాలను

US-China: జిన్‌పింగ్‌తో చర్చలు.. చైనాకు గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్..

US-China

Updated On : October 30, 2025 / 11:38 AM IST

US-China: అమెరికా, చైనా దేశాల మధ్య కొద్దికాలంగా టారిఫ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ టారిఫ్ ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా గురువారం భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు రెండు గంటలపాటు సాగింది. ఈ భేటీలో ఇద్దరు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు.

జిన్ పింగ్ తో భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ చైనాకు గుడ్ న్యూస్ చెబుతూ కీలక ప్రకటన చేశారు. చైనాపై సుంకాలను 10శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్‌పింగ్ తీవ్రంగా శ్రమిస్తారని భావిస్తున్నానని.. అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతంకు తగ్గిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీంతో చైనాపై మొత్తం టారిఫ్ లు 57శాతం నుంచి 47శాతంకు దిగిరానున్నాయని తెలిపారు.

జిన్ పింగ్ తో భేటీ అద్భుతంగా జరిగిందన్న ట్రంప్.. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్దరించేందుకు కూడా అంగీకారం కుదిరిందని.. అంతేకాక.. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని ట్రంప్ అన్నారు. మరిన్ని చర్చల కోసం ఏప్రిల్ నెలలో చైనా వెళతానని ట్రంప్ ప్రకటించారు.


2021లో చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 20శాతం ఉండేవి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అన్నిదేశాల ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో చైనాపైనా సుంకాలను పెంచారు. దీంతో చైనాపై సుంకాలు 57శాతంకు చేరాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సుంకాల వార్ కొనసాగింది. ఇటీవల అరుదైన ఖనిజాల విషయంలో చైనా తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ దేశం ఉత్పత్తులపై 155 శాతం వరకు సుంకాలను పెంచుతామని, నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ సుంకాల వార్ కొనసాగుతున్న వేళ.. తాజాగా.. ట్రంప్, జిన్‌పింగ్ భేటీ జరిగింది. ఈ భేటీ తరువాత ట్రంప్ మాట్లాడుతూ.. ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతంకు తగ్గిస్తున్నామని చెప్పారు. తాజా తగ్గింపుతో సుంకాలు 47శాతంకు చేరాయి.