రోజుకో లక్ష వ్యాక్సిన్ డోస్‌ల పంపిణీకి యూకే మిలటరీ రెడీ : డిఫెన్స్ సెక్రటరీ

రోజుకో లక్ష వ్యాక్సిన్ డోస్‌ల పంపిణీకి యూకే మిలటరీ రెడీ : డిఫెన్స్ సెక్రటరీ

Updated On : January 1, 2021 / 7:55 AM IST

UK military ready to deliver 1 lakh vaccines doses a day: యూకేలో అవసరమైతే లక్షలాదిమందికి వ్యాక్సిన్ పంపిణీచేయగలమని అంటోంది యూకే మిలటరీ. అవసరమైతే బ్రిటన్ సాయుధ దళాలు రోజుకు లక్ష మోతాదుల కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి బెల్ వాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వసంతకాల సీజన్‌లో వైరస్ ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని, లక్షలాది మందికి ముందు జాగ్రత్తగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ వ్యాక్సిన్ సాయపడుతుందని ఆయన తెలిపారు.

సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు హెల్త్ వర్కర్లతో కలిసి పనిచేసేందుకు 130 మంది మిలటరీ వర్కర్లు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఇప్పటికే మిలటరీ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అధికారాలను కూడా ఇచ్చినట్టు తెలిపారు. వ్యాక్సిన్ నిర్వాహణకు అవసరమైతే ఎక్కువ మంది మిలటరీ సిబ్బందిని వినియోగించవచ్చుని వాలెస్ చెప్పారు.

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు 250 మంది వైద్యపరమైన శిక్షణ పొందిన సిబ్బంది బృందాలు ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారని రక్షణ మంత్రి పేర్కొన్నారు. NHS సాయం కోరితే.. రోజుకు లక్ష మందికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని వాలెస్ వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను బ్రిటన్ బుధవారం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వాడుకలో ఉన్న ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్‌తో పాటు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ అందించనున్నట్టు రక్షణ మంత్రి బెల్ స్పష్టం చేశారు.