Ukraine-Russia Crisis : రష్యా సైనిక కాన్వాయ్‌ను పేల్చేసిన యుక్రెయిన్ డ్రోన్లు.. వీడియో..!
రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలను వచ్చిన దారినే తరిమికొట్టేందుకు యుక్రెయిన్ బలగాలు కూడా దీటుగానే సరిహద్దుల్లో ప్రతిఘటిస్తున్నాయి.

Ukraine Russia Crisis Watch Dramatic Video Of Drone Strikes Hitting Russian Convoys (1)
Ukraine-Russia Crisis : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్టుగా ఇరుదేశాల మధ్య దాడికి ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. యుక్రెయిన్ లోని కీవ్ నగరాన్ని పూర్తిగా చేజిక్కిచుకునేందుకు రష్యా బలగాలు భారీ ఆయుధాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. రష్యా బలగాలను వచ్చిన దారినే తరిమికొట్టేందుకు యుక్రెయిన్ బలగాలు కూడా దీటుగానే సరిహద్దుల్లో ప్రతిఘటిస్తున్నాయి. రష్యా సైనిక దళం మూడు మైళ్ల పొడువు ఉన్న రష్యన్ సైనిక కాన్వాయ్ కీవ్ మార్గంలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో రష్యా, యుక్రెయిన్ దళాల మధ్య భీకర పోరాటం కొనసాగుతోంది.
కీవ్ మార్గంలో హైవేపై రష్యా సైనిక కాన్వయ్ మూడు మైళ్ల పొడవు ఉన్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో యుక్రెయిన్ సైన్యం అప్రమత్తమై రష్యాకు చెందిన భారీ కాన్వయ్ పై టర్కీలో తయారైన Bayraktar TB2 డ్రోన్లతో పేల్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్రోన్ల సామర్థ్యానికి సంబంధించి యుక్రెయిన్ అంకారాకు రాయబారి అయిన Vasyl Bodnar మాట్లాడుతూ.. ఈ Bayraktar TB2 డ్రోన్లు చాలా శక్తివంతమైనవని, దేశంలో రష్యా దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలవని ఆయన అన్నారు. Bayraktar TB2 డ్రోన్లకు సంబంధించి అనేక బ్యాచులను టర్కీ నుంచి కివ్ కొనుగోలు చేసింది.
మరోవైపు.. మాస్కో దండయాత్రపై రష్యా, యుక్రెయిన్ మధ్య తొలిసారి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. అయినప్పటికీ ఇరుదేశాల మధ్య భీకర పోరు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చల పేరుతో బెలారస్ కు రావాలని రష్యా యుక్రెయిన్‌కు ఆహ్వానం పలికింది. అందుకోసం.. ఆ దేశంలోని గోమెల్ నగరానికి ప్రతినిధి బృందాన్ని కూడా పంపింది. యుక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం.. బెలారస్ తమకు ఆమోదయోగ్యమైన ప్రాంతం కాదని తేల్చిచెప్పారు. చర్చల విషయంలో యక్రెయిన్ అక్కడికి వచ్చే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ స్పష్టం చేశారు.
Video of a Ukrainian-Turkish TB-2 Drone taking out a Russian 2 Buk Air Defense Systems and their Support Convoy in a video released earlier today. https://t.co/DAKWhofYSw
— OSINTdefender (@sentdefender) February 27, 2022
ఒకవైపు తమ దేశంపై దాడులకు దిగుతూనే మరోవైపు బెలారస్ చూపిస్తూ అక్కడనే శాంతి చర్చలకు రావాలని పుతిన్ పిలుపు వెనుక మర్మం ఏంటో తమకు తెలుసునని యుక్రెయిన్ అధ్యక్షుడు తప్పుపట్టారు. తమకు ఇస్తాంబుల్, వార్సా, బ్రటిస్లావా, బాకు, బుడాపెస్ట్ లాంటి నగరాల్లో చర్చలు జరపడానికి తాము సిద్ధమని జెలెన్ స్కీ కూడా ప్రకటించారు. ఆఖరికి బెలారస్‌నే వేదికగానే చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ చర్చలతోనైనా ఇరుదేశాల మధ్య యుద్ధం ముగుస్తుందో లేదో చూడాలి.