India Mango: భారత మామిడి పండ్లను తిరస్కరించిన అమెరికా, ఎగుమతిదారులకు రూ.4 కోట్లు నష్టం..

తిరస్కరణకు గురైన మామిడిని ధ్వంసం చేయండి లేదా తిరిగి భారత్ కు పంపేయండి అని వారికి చాయిస్ ఇచ్చారు అధికారులు.

India Mango: భారత మామిడి పండ్లను తిరస్కరించిన అమెరికా, ఎగుమతిదారులకు రూ.4 కోట్లు నష్టం..

Updated On : May 18, 2025 / 7:26 PM IST

India Mango: అమెరికా చేసిన నిర్వాకంతో మన మామిడి పండ్ల వ్యాపారులు భారీగా నష్టపోయారు. కోట్ల రూపాయల నష్టం చవిచూశారు. అమెరికాకు మామిడి పండ్లు ఎగుమతి చేసింది ఇండియా. అయితే, డాక్యుమెంటేషన్ లో లోపాల కారణంగా మామిడి పండ్లు తిరస్కరణకు గురయ్యాయి. సుమారు 15 కంటైనర్ల మామిడిని తిరస్కరించారు. తప్పనిసరిగా చేయించాల్సిన ఇర్రేడియేషన్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌లో పొరపాట్లు ఉన్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అందుకే మన మామిడిని రిజెక్ట్ చేస్తున్నట్లు వివరించారు. ఈ పరిణామంతో భారత ఎగుమతిదారులు దాదాపు 4.28 కోట్ల రూపాయలు నష్టపోయారు.

తిరస్కరణకు గురైన మామిడిని ధ్వంసం చేయండి లేదా తిరిగి భారత్ కు పంపేయండి అని వారికి చాయిస్ ఇచ్చారు అధికారులు. అయితే, పండ్లను ఇండియాకి వెనక్కి పంపేందుకు అయ్యే రవాణ ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో మరో దారి లేక ఆ పండ్లను అమెరికాలోనే ధ్వంసం చేస్తున్నారు వ్యాపారులు.

భారత్ నుంచి అమెరికా వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్లను ఆ దేశంలో పలు ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు. లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా ఎయిర్ పోర్టుల్లో మామిడి పండ్ల షిప్‌మెంట్లను ఆపేశారు. దీనికి పత్రాల్లో లోపాలను సాకుగా చూపించారు. మే 8, 9 తేదీల్లో ముంబైలో ఈ మామిడి పండ్లకు ఇర్రేడియేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇర్రేడియేషన్ అనేది పండ్లలోని కీటకాలను నిర్మూలించి, వాటి నిల్వ కాలాన్ని పెంచడానికి ఉపయోగించే ప్రక్రియ. అయితే, ఈ ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో (ముఖ్యంగా పీపీక్యూ203 ఫారంలో) తప్పులు దొర్లాయని అమెరికా అధికారులు గుర్తించారు.

“పీపీక్యూ203 ఫారం సరిగ్గా జారీ చేయనందున సరకును తిరస్కరించినట్లు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తెలిపింది. సరకును వెనక్కి పంపాలి లేదా ధ్వంసం చేయాలని చెప్పింది. వెనక్కి పంపేందుకు అయ్యే ఖర్చును అమెరికా ప్రభుత్వం భరించదు” అని యూఎస్‌డీఏ స్పష్టం చేసినట్లు వ్యాపారులు తెలిపారు.

Also Read: ఇది డొనాల్డ్ ట్రంప్ వర్షన్‌ “బిగ్‌ బాస్‌” షో.. టీవీ షోలో గెలిస్తే అమెరికా పౌరసత్వం

”ముంబైలోని ఇర్రేడియేషన్ కేంద్రంలో అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్‌డీఏ) ప్రతినిధి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరుగుతుంది. అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతికి అవసరమైన పీపీక్యూ203 ఫారంను కూడా ఆయనే ధ్రువీకరించాలి. ఇర్రేడియేషన్ కేంద్రంలో జరిగిన పొరపాట్లకు మేం నష్టపోవాల్సి వచ్చింది” అని ఎగుమతిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

”తప్పనిసరి ఇర్రేడియేషన్ చికిత్సకు సంబంధించిన నిబంధనలు పాటించలేదని చెబుతున్నారు. ఇందులో నిజం లేదు. ఇర్రేడియేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే మాకు పీపీక్యూ203 ఫారమ్ ఇచ్చారు. యూఎస్‌డీఏ అధికారి జారీ చేసిన ఆ ఫారం లేకుండా ముంబై ఎయిర్ పోర్టులో మామిడి పండ్లను విమానంలోకి ఎక్కించడానికి కూడా అనుమతించరు” అని ఒక ఎగుమతిదారు అన్నారు.

వాస్తవానికి భారత్ లో పండే మామిడి పండ్లకు అమెరికా ప్రధాన ఎగుమతి మార్కెట్. ఇక్కడి నుంచి పెద్దఎత్తున మన మామిడి అక్కడికి ఎక్స్ పోర్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పత్రాల్లో లోపాలను సాకుగా చూపి మన మామిడిని తిరస్కరించడం పట్ల మామిడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పునకు మేము భారీగా నష్టపోవాల్సి వచ్చిందని రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.