US elections 2024 : అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలయమ్స్.. ఎలా ఓటు వేస్తారంటే?

US elections 2024 : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, ఇతర నాసా వ్యోమగాములు కూడా అంతరిక్షం నుంచి తమ ఓటు వినియోగించుకోనున్నారు.

US elections 2024 : అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలయమ్స్.. ఎలా ఓటు వేస్తారంటే?

US elections 2024 Sunita Williams

Updated On : November 5, 2024 / 10:11 PM IST

US elections 2024 : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పర్వం మొదలైంది. దేశ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు అక్కడి ఓటర్లు పోలింగ్ బూత్‌లకు చేరుకుంటున్నారు. ఈసారి అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

ఈ అధ్యక్ష ఎన్నికల్లో, పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఇతర నాసా వ్యోమగాములు కూడా అంతరిక్షం నుంచి తమ ఓటు వినియోగించుకోనున్నారు.

వ్యోమగాములు ఓటు వేసేందుకు నాసా ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం అంతరిక్షంలో నలుగురు అమెరికన్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తిగా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం అంతరిక్షంలో చిక్కుకున్న బోయింగ్ స్టార్‌లైనర్ మిషన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఉన్నారు.

ఫిబ్రవరి వరకు వీరిద్దరూ భూమికి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. సునీతా విలియమ్స్ సెప్టెంబరులో విలేకరుల సమావేశంలో అంతరిక్షం నుంచి ఓటు వేయాలని తన కోరికను వ్యక్తం చేశారు. “పౌరులుగా ఇది మా ముఖ్యమైన కర్తవ్యం. నేను అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నాను. ఇది చాలా ప్రత్యేకమైన అనుభవం” అని ఆమె పేర్కొన్నారు.

అంతరిక్షం నుంచి ఓటింగ్ ఎలా జరుగుతుంది? :
అంతరిక్షంలో వ్యోమగాముల కోసం నాసా ఒక ప్రత్యేక ప్రక్రియను రూపొందించింది. అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియ గైర్హాజరీ బ్యాలెట్ (ఆబ్సెంటీ ఓటింగ్) విధానం మాదిరిగానే పనిచేస్తుంది. ముందుగా, వ్యోమగాములు ఫెడరల్ పోస్ట్ కార్డ్ అప్లికేషన్‌ను పూర్తి చేస్తారు.

తద్వారా ఆబ్సెంటీ ఓటింగ్ బ్యాలెట్‌ను అభ్యర్థిస్తారు. ఆ తరువాత, వారికి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పంపడం జరుగుతుంది. అలా వ్యోమగాములు అప్లికేషన్ నింపి ఓటు వేస్తారు. ఈ ఎలక్ట్రానిక్ బ్యాలెట్ అంతరిక్ష కేంద్రం నుంచి టెక్సాస్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని మిషన్ కంట్రోల్ వరకు 1.2 మిలియన్ మైళ్ల దూరం ప్రయాణిస్తుంది.

ఈ ఎలక్ట్రానిక్ బ్యాలెట్ నాసా ట్రాకింగ్, డేటా రిలే శాటిలైట్ సిస్టమ్ ద్వారా భూమికి తిరిగి పంపుతారు. న్యూ మెక్సికోలోని నాసా ఏజెన్సీ టెస్ట్ ఫెసిలిటీలోని భారీ యాంటెనాకు పంపుతారు. ఆ తర్వాత టెక్సాస్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. అక్కడ నుంచి ఓటు కౌంటీ క్లర్క్‌కు పంపుతారు. అక్కడే ఓటును ధృవీకరిస్తారు. ఓటును ప్రైవసీ కోసం బ్యాలెట్ పేపర్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది. తద్వారా సంబంధిత వ్యోమగామి, క్లర్క్ మాత్రమే ఆ ఓటును చూడగలరు.

చరిత్రలో అంతరిక్షం నుంచి ఓటింగ్ ఎప్పుడు జరిగింది? :
1997లో, డేవిడ్ వోల్ఫ్ అంతరిక్షం నుంచి ఓటు వేసిన మొదటి అమెరికన్ పౌరుడిగా చరిత్ర సృష్టించాడు. అప్పటి నుంచి చాలా మంది వ్యోమగాములు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నాసా ప్రకారం.. కేట్ రూబిన్స్ 2020 అమెరికా ఎన్నికలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఓటు వేశారు. అంతరిక్షం నుంచి ఓటు వేసిన చివరి వ్యోమగామిగా చరిత్రలో నిలిచారు.

Read Also : US elections 2024: కొనసాగుతున్న పోలింగ్‌.. డిక్స్‌విల్లే నాచ్‌ ఫలితం వచ్చేసింది..