భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త సవాళ్లు: పాకిస్థాన్‌పై అమెరికా అనుకూల వైఖరి.. మరి మనమెందుకు రష్యాతో బంధాన్ని తెంచుకోవాలి?

అమెరికా నుంచి పాకిస్థాన్‌కు అందుతున్న ఆర్థిక సాయం అంచనాల కంటే ఎక్కువగా ఉంది. గతంలో హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు పాకిస్థాన్‌కు మంజూరవుతున్నాయి.

భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త సవాళ్లు: పాకిస్థాన్‌పై అమెరికా అనుకూల వైఖరి.. మరి మనమెందుకు రష్యాతో బంధాన్ని తెంచుకోవాలి?

Updated On : August 8, 2025 / 11:19 AM IST

ప్రస్తుతం భారత్-అమెరికా సంబంధాలు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు, భారత ఎగుమతులపై 50 శాతం అధిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై టారిఫ్‌లు పెంచుతానని హెచ్చరించారు.

అయితే, అమెరికా స్వయంగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ, భారత్‌పై విమర్శలు చేయడాన్ని భారత్ ప్రశ్నించగా, ట్రంప్ “ఆ విషయం నాకు తెలియదు. దానిని పరిశీలించాలి” అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవైపు మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కు అమెరికా సాయం చేస్తున్నప్పుడు మనం అగ్రరాజ్య మాటలు ఎందుకు వినాలి. రష్యాతో సత్సంబంధాలు ఎందుకు కొనసాగించకూడదు? పాక్‌కు అమెరికా ఏ మేరకు సాయం చేస్తుందో చూద్దాం..

అమెరికా-పాకిస్థాన్ సంబంధాలలో మార్పు
భారత్‌పై కఠినంగా వ్యవహరిస్తూనే, పాకిస్థాన్ పట్ల అమెరికా అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది. పాకిస్థాన్‌కు అదనపు ఆర్థిక సాయం అందించడం, ఆ దేశ పౌరులకు వీసాల మంజూరులో గణనీయమైన పెరుగుదల, చమురు క్షేత్రాల అభివృద్ధికి ఒప్పందాలు కుదుర్చుకోవడం, అలాగే సుంకాన్ని 19 శాతానికి తగ్గించడం వంటి చర్యలు తీసుకుంది అమెరికా.

అమెరికా నుంచి పాకిస్థాన్‌కు అందుతున్న ఆర్థిక సాయం అంచనాల కంటే ఎక్కువగా ఉంది. గతంలో హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు పాకిస్థాన్‌కు మంజూరవుతున్నాయి. 2020లో పాకిస్థాన్‌కు 89 శాతం అధిక నిధులు అందాయి. 2023లో ఇది 64 శాతం, 2024లో 44 శాతం అధికంగా నమోదైంది.

పాకిస్థాన్ చమురు క్షేత్రాలపై కీలక ఒప్పందాలు
సుంకాల వివాదం మధ్యనే ట్రంప్ పాకిస్థాన్‌తో చమురు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లోని చమురు క్షేత్రాల అభివృద్ధికి అమెరికా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇది పాకిస్థాన్‌కు ఆర్థికంగా సహాయపడటమే కాకుండా, అమెరికన్ కంపెనీలకు కూడా భారీగా ప్రయోజనాలను చేకూరుస్తుంది.

పాకిస్థాన్‌లో చమురు క్షేత్రాలు ఉన్నాయి. తవ్వకాలు జరుగుతున్నాయి.. దీంతో 2024లో దేశ చమురు నిల్వలు సగటున 23 శాతం పెరిగాయి. సింధ్‌లోని చకర్ 1, ఫాకీర్ 1 (జూన్, డిసెంబర్), ఖైబర్ పక్తూన్ ఖ్వాలోని స్పిన్‌వామ్ 1, రజ్గీర్ 1, పంజాబ్‌లోని సోగ్రి నార్త్ 1, సింధ్‌లోని కోట్ నవాబ్ 1 వంటి క్షేత్రాలు ఇందులో ఉన్నాయి. ఈ క్షేత్రాల అభివృద్ధి పాకిస్థాన్‌ పొరుగు దేశాలపై చమురు కోసం ఆధారపడకుండా చేస్తుంది.

పాక్ విద్యార్థులకు భారీగా వీసాల మంజూరు
విద్యార్థి వీసాల మంజూరులో కూడా పాకిస్థాన్‌కు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. జనవరి నుంచి మే మధ్య కాలంలో చైనీస్ విద్యార్థులకు ఇచ్చిన వీసాలు గత సంవత్సరంతో పోలిస్తే 8.1 శాతం తగ్గాయి. ఇదే సమయంలో, భారతీయులకు 28.7 శాతం, నేపాలీయులకు 13 శాతం తగ్గుదల నమోదైంది. అయితే, పాకిస్థాన్ విద్యార్థులకు వీసాలు మాత్రం 28 శాతం పెరిగాయి.

భారత్‌పై విషం కక్కే పాకిస్థాన్‌కు అమెరికా ఇన్ని ప్రయోజనాలు కల్పిస్తోంది. పాక్‌కు అమెరికా ఇంతగా మద్దతు ఇస్తుంటే మరి రష్యాతో భారత్‌ ఎందుకు తన బంధాన్ని తెంచుకోవాలని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.