Donald Trump: సుంకాలపై భారత్‌కు ట్రంప్ గుడ్ న్యూస్..! త్వరలోనే..
రష్యాతో చమురు వ్యాపారం కారణంగానే ఇండియా ఇంత అధిక సుంకాలను ఎదుర్కొంటోందని ఆయన వివరించారు.
Donald Trump: రష్యాతో చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్ పై సుంకాల మోత మోగించిన సంగతి తెలిసిందే. తన మాట వినలేదని భారత్ పై ట్రంప్ రగిలిపోయాడు. తన దారికి తెచ్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. మనల్ని భయపెట్టాలని చూశాడు. ఇందులో భాగంగా ఇండియాపై టారిఫ్ బాంబ్స్ పేల్చాడు. అయితే, ట్రంప్ బెదిరింపులకు భారత్ భయపడలేదు. ఈ క్రమంలో టారిఫ్స్ విషయంలో భారత్ కు గుడ్ న్యూస్ చెప్పారు ట్రంప్.
భారత్ తో వాణిజ్య చర్చల గురించి ట్రంప్ ను అడగ్గా.. సుంకాలను తగ్గిస్తామని ఆయన చెప్పారు. రష్యాతో చమురు వ్యాపారం కారణంగానే ఇండియా ఇంత అధిక సుంకాలను ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. కాగా, ఇప్పుడా కొనుగోలును ఇండియా నిలిపివేసిందన్నారు. ఇక, త్వరలోనే భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించిన ట్రంప్.. ఏదో ఒక సమయంలో భారత్ పై విధించిన సుంకాలను తగ్గించాలని అమెరికా యోచిస్తోందన్నారు.
”రష్యాతో చమురు వ్యాపారం కారణంగా భారత్ పై సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు రష్యన్ చమురును గణనీయంగా నిలిపివేశారు. మేము సుంకాలను తగ్గిస్తాము. ఏదో ఒక సమయంలో మేము వాటిని తగ్గిస్తాము” అని ట్రంప్ అన్నారు.
మాస్కోతో ఢిల్లీ ఇంధన ఒప్పందాలపై సీరియస్ అయిన ట్రంప్.. భారత్ పై సుంకాల మోత మోగించారు. ఆగస్టులో భారత దిగుమతులపై సుంకాలను 50శాతానికి రెట్టింపు చేశారు. యుక్రెయిన్ పై యుద్ధాన్ని ముగించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి వ్యూహంగా ఈ చర్యను సమర్థించుకున్నారు ట్రంప్. అప్పటి నుండి ఇండియా- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. రష్యాతో తన చమురు వాణిజ్యాన్ని భారత్ ముగించబోతోందని ట్రంప్ అనేకసార్లు చెప్పారు.
భారత్ తో వాణిజ్య చర్చల గురించి మీడియా ప్రతినిధులు ట్రంప్ ను అడిగారు. దానికి ట్రంప్ బదులిచ్చారు. “మేము భారత్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నాము. గతంలో ఉన్న దానికంటే చాలా భిన్నంగా. ప్రస్తుతం వారు నన్ను ప్రేమించడం లేదు. కానీ వారు మళ్ళీ మనల్ని ప్రేమిస్తారు. న్యాయమైన ఒప్పందం పై చర్చలు జరుగుతున్నాయి. మేము దగ్గరవుతున్నాము. త్వరలో డీల్ కుదురుతుంది” అని ట్రంప్ అన్నారు.
ట్రంప్ లో ఈ మార్పు రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవలి కాలంలో రష్యన్ ఆయిల్ దిగుమతులను భారత్ 30శాతం తగ్గించింది. దాంతో టారిఫ్‌లు తగ్గింపు అంశంపై ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ గురించి అనేకసార్లు చర్చలు జరిగాయి. అయితే, కొన్ని అంశాల్లో స్పష్టత రాకపోవడంతో ఆ చర్చలు ఫలించలేదు.
