భారత్ -పాక్ మధ్య యుద్ధం తలెత్తితే.. చైనాకు కూడా భారీ నష్టం జరుగుతుందా.. ఎలా అంటే..?

శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని పాకిస్థాన్, భారత్ దేశాలకు చైనా సూచిస్తుంది.

భారత్ -పాక్ మధ్య యుద్ధం తలెత్తితే.. చైనాకు కూడా భారీ నష్టం జరుగుతుందా.. ఎలా అంటే..?

China India

Updated On : May 10, 2025 / 2:30 PM IST

India Pakistan Tension: భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే, ఇరుదేశాలు సంయమనం పాటించాలని పలు దేశాలు కోరుతున్నాయి. వీటిలో చైనా కూడా ఒకటి. భారత్ – పాకిస్థాన్ మధ్య సమస్యకు ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా పేర్కొంది. ఇరుదేశాలు సంయమనం పాటించాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శాంతియుత మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే చర్యలను తగ్గించుకోవాలని పాకిస్థాన్, భారత్ దేశాలకు చైనా సూచిస్తుంది. సమస్యను పరిష్కరించేందుకు నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా పేర్కొంది. అయితే, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే చైనాకు కూడా నష్టం వాటిళ్లుతుందని, అందుకే ఇరు దేశాల మధ్య యుద్ధం, ఉద్రిక్తతలను చైనా కోరుకోదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే పాకిస్థాన్ లో తీవ్ర నష్టం వాటిళ్లుతుంది. పాకిస్థాన్ అస్థిర పరిస్థితులను చైనా ఎప్పటికీ కోరుకోదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆ దేశంలో చైనా పెట్టిన పెట్టుబడులు వృథా అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

2005 – 2024 మధ్య చైనా పాకిస్థాన్ లో 68 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు.. భారత్ – పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న షింజాంగ్ ప్రావిన్స్ అభివృద్ధిని చైనా కోరుకుంటోంది. చైనా – పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టుల్లో భాగంగా పాకిస్థాన్ లో ఆదేశం భారీ పెట్టబడులు పెట్టింది. ఆ ప్రాజెక్టు విజయవంతం అవ్వాలని చైనా కోరుకుంటుంది. పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రరూపందాల్చితే రోడ్డు మార్గం ద్వారా మధ్య ఆసియాను అనుసంధానించాలనుకునే తన కలల ప్రాజెక్టు ఆగిపోతుందని చైనా ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే చైనా ప్రాజెక్టుల మీద ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుంది.

చైనా, పాకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండటంతోపాటు ఇస్లామాబాద్ భారీస్థాయిలో చైనా నుంచి ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. గత ఐదేళ్లలో పాకిస్థాన్ సమకూర్చుకున్న ఐదు ఆయుధాల్లో నాలుగు చైనావే. అయితే.. చైనా తన సొంత ప్రయోజనాలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఎలాంటి వివాదంలో చిక్కుకోవడానికి ఇష్టపడదు. అందుకే ఆ దేశం ఏ యుద్ధంలోనూ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా మద్దతివ్వడం లేదు.

ప్రస్తుతం చైనాకు అమెరికా సుంకాలు తలనొప్పిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తో తన సంబంధాలు మెరుగ్గా ఉండాలని చైనా కొరుకుంటుంది. భారత్ కూడా చైనాకు పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే భారతదేశంతోనూ చైనా బలమైన సంబంధాలను కోరుకుంటుంది. చైనాకు భారత్, పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు ఉండటం చైనాకు మేలు చేస్తుంది. తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడం చైనాకు అవసరం. అందకే ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణంను చైనా కోరుకుంటుంది.