ఆఫీసుల్లో 50 శాతం జూనియర్‌ స్టాఫ్‌ విధులకు హాజరు కావాలి : కేంద్రం

  • Published By: srihari ,Published On : May 19, 2020 / 03:28 AM IST
ఆఫీసుల్లో 50 శాతం జూనియర్‌ స్టాఫ్‌ విధులకు హాజరు కావాలి : కేంద్రం

Updated On : May 19, 2020 / 3:28 AM IST

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. డిప్యూటీ సెక్రెటరీ కంటే తక్కువ స్థాయి పోస్టుల్లో ఉన్న జూనియర్‌ ఉద్యోగుల్లో 50 శాతం మంది ఆఫీసుల్లో విధులకు హాజరు కావాలని కేంద్రం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇప్పటివరకూ 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇక నుంచి జూనియర్‌ ఉద్యోగులు రోజు విడిచి రోజు ఆఫీసులకు వచ్చేలా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు రోస్టర్‌ను రూపొందించాలని ఆదేశించింది.

చాలా కంపెనీలు, సంస్థలు తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల్లో ఒకటి రెండు కరోనా కేసులు నమోదు కాగానే వెంటనే ఆ ప్రాంతాన్ని మూసివేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీనిపై కేంద్ర ఒక స్పష్టతనిచ్చింది.. ఒకటి లేదా రెండు కేసులతో కార్యాలయ భవనాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. భవనాన్ని మొత్తం శానిటైజ్ చేసి తిరిగి కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని తెలిపింది. భారీగా కేసులు నమోదైన సందర్భాల్లో మాత్రం భవనాన్ని 48 గంటలపాటు మూసి ఉంచాలని కేంద్రం మార్గదర్శకాల్లో సూచించింది. భవనాన్ని శానిటైజ్‌ చేసి, సురక్షితమని ధ్రువీకరించుకున్నాకే మళ్లీ ప్రారంభించాలని తెలిపింది. 

సిబ్బంది ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’విధానంలో పనిచేయాలని వెల్లడించింది. కార్యాలయ సిబ్బందిలో ఎవరైనా ఫ్లూ వంటి లక్షణాలు ఉంటే వారిని ఆఫీసులకు రావద్దని సూచించాలని తెలిపింది. స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఒక గదిలో లేదా ఆఫీసు ప్రాంతంలో ఎవరైనా కోవిడ్‌–19 సోకిన లక్షణాలు ఉంటే వారిని మరో చోట ఒంటరిగా ఉంచాలని, వైద్యుని సలహా తీసుకోవాలని సూచించింది. కోవిడ్‌–19 అనుమానిత లేక పాజిటివ్‌ అని తేలితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కేంద్రం మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది. 

Read: 10 రూపాయల నోటుని మాస్క్ లా వాడిన యువకుడు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు