500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం

cm jagan to construct 500 temples: రాష్ట్రంలో 500 ఆలయాలు నిర్మించాలన్నది సీఎం జగన్ సంకల్పం అని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో ఆలయాల నిర్మాణం ఆలస్యమైందని అన్నారు. అందరికీ వెంకన్నను చేరువ చేయడమే దీని వెనకున్న ఉద్దేశమని ఆయన చెప్పారు.
టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిన కల్యాణమస్తు కార్యక్రమాన్ని తాము పునరుద్ధరిస్తున్నామని, పేద కుటుంబాలకు చెందిన జంటలకు తాళి, వివాహ దుస్తులు అందజేసి పెళ్లిళ్లు జరిపిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
కృష్ణా జిల్లాలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిగిన గుడికో గోమాత కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. గాయత్రీ సొసైటీ బహూకరించిన కపిల గోవును ఆలయానికి అందజేశారాయన. గుడికో గోమాత కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.