కొత్త పార్లమెంట్ భవనానికి నేడే భూమి పూజ..

Delhi : foundation stone laid for new parliament today : కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోడీ ఈరోజు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరుగనుంది. ఈ శుభకార్యానికి కేంద్రమంత్రులు..రాజకీయ పార్టీల నేతలతో పాటు పలు దేశాలకు చెందిన రాయబారులు సైతం పాల్గొననున్నారు. వీరితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, సీఎం వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు.
భవిష్యత్తులో 100 ఏళ్లకు సరిపడా అవసరమైన అత్యాధునిక సదుపాయాలతో ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని కేంద్రం ప్రభుత్వం నిర్మిస్తోంది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో రూ.971 కోట్ల ఖర్చుతో ప్రారంభంకానుంది. ప్రస్తుత ఉన్న పార్లమెంట్ భవనం కంటే 17వేల చదరపు కిలోమీటర్లు పెద్దగా ఈ కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకోనుంది. పార్లమెంట్ విస్టా భవనం ప్రాజెక్టు కోసం రూ.11,794 కోట్లుఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
భవనంపై భారతీయత ప్రతిభింబించేలా..పురి విప్పిన జాతీయ పక్షి నెమలి..
కొత్త పార్లమెంట్ భవనం అణువణువునా భారతీయత ప్రతిభింబించేలా తీర్చిదిద్దనున్నారు. పురివిప్పి ఆడుతున్న జాతీయ పక్షి నెమలి ఆకృతిలో లోక్‌సభ పైకప్పు, జాతీయపుష్పం విరబూసిన కమలం రూపంలో రాజ్యసభ పైకప్పు, పార్లమెంట్‌లో అంతర్భాగంగా నిలువనున్న జాతీయ వృక్షం మర్రిచెట్టు రూపంలో తీర్చిదిద్దనున్నారు.
పార్లమెంట్ కొత్త భవనంలో గ్రౌండ్, మొదటి, రెండు అంతస్థులు ప్రస్తుత భవనం ఎత్తు ఉండేలా కొత్త భవనం నిర్మాణం చేపట్టనున్నారు. ఒకే సారి 1,224 మంది ఎంపీలు కూర్చుకోవడానికి అనుకూలమైన ఏర్పాట్లు జరుగనున్నాయి. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేలా ఆకట్టుకునే సీట్ల నిర్మాణం జరుగనుంది.
భారతదేశ ప్రజాస్వామ్య వైభవాన్ని చాటిచెప్పేలా ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. విశాలమైన లాంజ్, లైబ్రరీ, బహుళ కమిటీలకు గదులు, భోజనశాలలు, లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియావారితో పాపటు సామాన్య ప్రజల కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నారు. మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలకు 480 సీట్లు చొప్పున ఏర్పాట్లు చేయనున్నారు.
ఎంపీలకు అధునాతన సౌకర్యాలు
ప్రస్తుత భవనంలో తొలి రెండు వరుసల్లో కూర్చున్న ఎంపీలకు మాత్రమే డెస్క్‌లు ఉన్నాయి. కొత్త భవనం నిర్మాణంలో మాత్రం మొత్తం సభ్యులందరికీ డెస్క్‌లు ఉండేలా ఏర్పాట్లున్నాయి. ప్రతి ఎంపీకి టచ్ స్క్రీన్‌తో కూడిన డిజిటల్ సిస్టమ్ లు అందుబాటులోకి రానున్నాయి.
లోక్‌సభే సెంట్రల్ హాలుగా 1315 చదరపు మీటర్లలో విస్తరించి కనువిందు చేయనుంది. లోక్‌సభను ఆనుకొనే పీఎం కార్యాలయం, 20 మీటర్ల ఎత్తులో కానిస్టిట్యూషనల్ హాల్, దానిపై అశోక స్థూపం నిర్మించనున్నారు. ప్రస్తుత భవనానికి ఉన్నట్లుగానే కొత్త భవనం చుట్టూ నిలువెత్తు రాతి స్తంభాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్యాలరీల్లో కూర్చునే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా తెరలు ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీల కోసం రెండు గేట్లు, ఎంపీల వాహనాలు వచ్చేందుకు మరో రెండు, సాధారణ ప్రజలు, మీడియా, సందర్శకుల కోసం మరో రెండు భవనానికి గేట్లు ఏర్పాటు చేస్తున్నారు.
నూతన భవనంలో అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నూతన భవనం డిజైన్ ను గుజరాత్‌కు చెందిన హెచ్‌పీసీ సంస్థ రూపొందించగా.. నిర్మాణ బాధ్యతలను టాటా సంస్థ దక్కించుకుంది. నిర్మాణంలో ప్రత్యక్షంగా రెండువేల మంది, పరోక్షంగా 9వేల మంది కార్మికులు పాల్గొననున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనానికి వందేళ్ల చరిత్ర ఉంది. 1921, ఫిబ్రవరి 21న ప్రస్తుత పార్లమెంట్‌కు శంకుస్థాపన చేయగా.. ఆ సమయంలో రూ.83లక్షలు వ్యయమైంది. ఆరేళ్లలో నిర్మాణం పూర్తి చేశారు. 1927, జనవరి 18న పార్లమెంట్ ప్రారంభోత్సవం చేశారు.