ED..300% Staff : దాడుల్లో ED దూకుడు, 300శాతం అదనపు సిబ్బంది కావాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి
ఇటీవల కాలంలో ఈడీ దాడులు పెరిగాయి. దీంతో దాడులు చేయటానికి తగిన సిబ్బంది లేదని కాబట్టి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఈడీ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ED appeals to the center Govt to allocate 300 percent additional staff
ED appeals to the enter allocate 300 percent staff : ఈడీ…ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్…తెల్లారిలేస్తే..ఎక్కడోచోట ఈ పదం వింటూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాలు మొదలుకుని…దేశంలో ఏదో ఓ చోట…ఈడీ దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజూ ఏదో కేసు నిందితుల విచారణో, సోదాలో జరుగుతూనే ఉన్నాయి. ఆర్థిక నేరాల లింకులు కనిపెట్టడం మొదలుకుని…రాజకీయ నేతల ఇళ్లల్లో సోదాల దాకా ఈడీ అన్నింటికీ ఆధారమైపోయింది. మనీలాండరింగ్ వంటి నేరాలు పెరిగిపోతుండడంతో ఈడీ అధికారులకు క్షణం తీరిక లేకుండా పోయింది. ఇది సిబ్బందిపై పనిభారాన్ని పెంచుతోంది. అందుకే అదనపు సిబ్బంది కావాలని ఈడీ కోరుతోంది. సిబ్బందిని పెంచాలని కోరుతున్న సంఖ్య కూడా ఇరవయ్యో, ముప్పయ్యో కాదు…300శాతం సిబ్బందిని అదనంగా కేటాయించాలన్నది ఈడీ కేంద్రానికి చేస్తున్న విజ్ఞప్తి.
మనీ ల్యాండరింగ్ కేసుల్లో గడచిన కొన్నేళ్లగా….ఈడీ దూకుడు పెంచింది. మనీ ల్యాండరింగ్ కేసులో వరుస దాడులతో వ్యాపారవేత్తలను, రాజకీయ నేతలను, కంపెనీలను బెంబేలిత్తిస్తోంది. ఈ దాడులపై చాలాసార్లు ప్రతిపక్షాలు ఈడీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి కూడా. ఈడీ అధికారాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. చాలా కేసులు ఈడీ విచారణ పరిధిలో ఉన్నాయి. బ్యాంకులకు ఎగవేత, మోసం, అవినీతి, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం వంటి కేసులన్నీ ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇలాంటి కేసులపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి…అదనంగా భారీ సంఖ్యలో సిబ్బంది అవసరముందని ఈడీ అధికారులంటున్నారు. కొన్ని కేసుల్లో సంపన్నులు కొందరు విదేశాల్లో కార్పొరేట్ వ్యవస్థలను ఏర్పాటుచేసుకుని అక్రమ నిధులలు బదాలయించుకుంటున్నారని, దర్యాప్తును ఆలస్యం చేస్తున్నారని…విచారణను అన్నివిధాల్లో కొనసాగించేందుకు, ఛార్జ్ షీట్ నమోదుచేసేందుకు అదనపు సిబ్బంది కావాలని ఈడీ అధికారులు కోరుతున్నారు.
ఇప్పటివరకూ ఈడీ నమోదుచేసిన మొత్తం PMLA కేసుల సంఖ్య 5వేల422కాగా, వాటిలో 3,555 మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నమోదయినవే.
2021-22లో అత్యధికంగా 11వందల 80 కేసులు నమోదయ్యాయి. జాతి వ్యతిరేక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళ్లిపోయిన 23 మందిని అప్పగించాల్సిందిగా ఇప్పటికే ఈడీ విదేశాలకు 30 విజ్ఞప్తులు చేసింది. 34 మదికి రెడ్ కార్నర్ నోటీసులిప్పించింది. మనీ ల్యాండరింగ్ కేసులు దర్యాప్తు చేసేందుకు అధికారం ఉన్న ఏకైక సంస్థ ఈడీనే అని, కానీ సరిపడా సిబ్బంది లేరని అధికారులంటున్నారు. ప్రస్తుతమున్న అధికారులు, సిబ్బంది సహా ప్రస్తుత మున్న 1,700 మంది సంఖ్య ఏమాత్రం సరిపోదని, 6వేలకు పెంచాలని కోరుతున్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో జోనల్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని ఈడీ కోరుతోంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రెండు జోనల్ ఆఫీసులు ఏర్పాటుచేయాలన్నది ఈడీ విజ్ఞప్తి. ప్రస్తుతం ఈడికి 21 జోనల్, 18 సబ్ జోనల్ ఆఫీసులున్నాయి. 2012-13 నుంచి 2018-19 మధ్య 1,262 కేసులు నమోదయితే…2019-20 నుంచి 2021-22 మధ్య 2,723 కేసులు నమోదయ్యాయి. ఫారిన్ ఎక్సేంజ్ చట్టం అతిక్రమణ కేసులు 11వేల 427 నుంచి 13వేల 473కు పెరిగాయి.