పోలీసులతో అనుచితంగా ప్రవర్తించిన కొడుకుతో చెత్త ఎత్తించి, టాయిలెట్లు కడిగించిన మాజీమంత్రి

కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసుల. మండుటెండుల్లో సైతం డ్యూటీలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా శ్రమిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడటంలో పోలీసులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి పోలీసులతో అనుచితంగా ప్రవర్తించిన కొడుక్కి మాజీమంత్రి గుణపాఠం చెప్పారు. పోలీసులకు క్షమాపణలు చెప్పించడమే కాదు, రోడ్డుపై చెత్త ఎత్తించి, మూత్రశాలలు కూడా కడిగించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగరంలో ఈ ఘటన జరిగింది. కరోనా పోరులో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసులపై అక్కడక్కడా కొంతమంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేయడమే కాదు, పోలీసుల విధులకు అడ్డు తగులుతున్నారు. వారిపై దాడులకూ తెగబడుతున్నారు.
మా నాన్న ఎవరో తెలుసా?
ఈ క్రమంలోనే గురువారం(ఏప్రిల్ 30,2020) గ్వాలియర్ నగరంలో బైక్ పై రోడ్డుపైకి వచ్చిన యువకుడిని పోలీసులు ఆపారు. ముఖానికి మాస్క్ లేకుండా ఎందుకు వచ్చావని ప్రశ్నించగా సదరు యువకుడు పోలీసులపై జులుం ప్రదర్శించాడు. ‘మా నాన్న ఎవరో తెలుసా’ అంటూ పోలీసులను బెదిరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో మాజీ మంత్రి ప్రద్యుమన్ సింగ్ తోమర్ స్పందించారు. ఈ వీడియోకి ఆయనకి సంబంధం ఏమిటిని అనుకుంటున్నారా ..పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది ఆయన సుపుత్రుడే మరి.
కొడుక్కి గుణపాఠం చెప్పిన తండ్రి.. చెత్త ఎత్తించి, మూత్రశాలలు కడిగించారు:
తన కొడుకు రిపుదమాన్ చేసిన పనికి తోమర్ విచారం వ్యక్తం చేయడమే కాకుండా అదే రోజు సాయంత్రం అతడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి పోలీసులకు క్షమాపణ చెప్పించారు. అలాగే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించారు. అక్కడితో ఆగకుండా తర్వాతి రోజు కొడుకుకి సరైన గుణపాఠం చెప్పారు. మున్సిపల్ కార్మికులతో కలిపి శుక్రవారం(మే 1,2020) రోడ్డుపై చెత్త ఎత్తించారు. దాంతోపాటే పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు శిక్షగా పారిశుద్ధ్య పని చేయించారు. మూత్రశాలలను తన కుమారుడితో కడిగించారాయన.
కొడుక్కి బుద్ధి చెప్పిన తండ్రిపై ప్రశంసల వర్షం:
ప్రద్యుమన్ సింగ్ తోమర్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతూ తానే స్వయంగా రోడ్లను పరిశుభ్రం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తప్పు చేసింది తన సొంత కొడుకు అయినప్పటికీ… అతడికి శిక్ష విధించి తన హుందాతనాన్ని చాటుకున్న ఈ మంత్రి ని అందరూ కొనియాడుతున్నారు. ఇలాంటి సంఘటన జరగడం నిజంగా అరుదైనది అని చెప్పుకోవచ్చు. ప్రద్యుమన్ సింగ్ తోమర్ ను అందరూ అభినందిస్తున్నారు. వావ్, సూపర్ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలని కామెంట్ చేస్తున్నారు. అధికారం, డబ్బు మదంతో విర్రవీగే రాజకీయ నాయకులు ఇది చూసి బుద్ది తెచ్చుకోవాలంటున్నారు.