Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లైవ్.. సాయంత్రం 5 గంటల వరకు 77.55శాతం పోలింగ్

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు.

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ లైవ్.. సాయంత్రం 5 గంటల వరకు 77.55శాతం పోలింగ్

Munugode bypoll Live

Updated On : November 4, 2022 / 6:39 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 03 Nov 2022 05:45 PM (IST)

    పలు ప్రాంతాల్లో చదురుమదురు ఘటనలు

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో చదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చివరిగంటలో ఓట్లు వేయడానికి ఓటర్లు అధికంగా వచ్చారు. మాజీ ఎంపీ వివేక్ పీఏ రమణ వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు అనంతరం రమణను అదుపులోకి తీసుకున్నారు. చండూరులో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలింగ్‌ జరుగుతోన్న తీరును పరిశీలించేందుకు మర్రిగూడ మండలం శివన్నగూడేనికి వెంకటరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వచ్చారు. ఆయనను ఇతర పార్టీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రాజగోపాల్‌ రెడ్డిని పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపారు.

  • 03 Nov 2022 05:31 PM (IST)

    సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 77.55 శాతం పోలింగ్ న‌మోదు

    మునుగోడు ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల‌ వరకు 77.55 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓట్లు 2,41,805 ఉండగా, ఇప్పటివరకు 1,87,527 మంది ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ భారీగా క్యూలు కనపడుతున్నాయి. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జరుగుతుంది.

  • 03 Nov 2022 05:23 PM (IST)

    ఓటర్లు అందరూ రండి.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి..

    ‘ఓటర్లు అందరూ రండి.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి..’ అంటూ తెలంగాణ సీఈవో పిలుపునిచ్చింది. చక్రాల కుర్చీలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న కొందరి ఫొటోలను పోస్ట్ చేసింది. మునుగోడులో ఓటింగ్ మరికాసేపట్లో ముగియనుంది. ఆలోగా వచ్చి క్యూలైన్లలో నిలబడవచ్చు.

  • 03 Nov 2022 04:58 PM (IST)

    సాయంత్రం సమయంలో అధికంగా వచ్చిన ఓటర్లు

    మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం సమయంలో ఓటర్లు అధికంగా తరలివచ్చారు. పోలింగ్ కు మరో గంట మాత్రమే సమయం ఉంది. దీంతో క్యూ లైన్లలో ఓటర్లు బారులు తీరి కనపడుతున్నారు. సమయం ముగిసేలోగా వచ్చి, క్యూలైన్లో నిలబడే వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది.

  • 03 Nov 2022 04:38 PM (IST)

    ఎట్టకేలకు ఓట్లు వేసేందుకు ఒప్పుకున్న రంగం తండా వాసులు

    మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తమ తండాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇస్తేనే ఓటు వేస్తామని చెప్పిన గట్టుప్పల్ మండలంలోని రంగం తండావాసుల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. వారితో తెలంగాణ మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. తండాలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓటు వేసేందుకు రంగం తండావాసులు కదిలారు.

  • 03 Nov 2022 03:57 PM (IST)

    రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిని కలిసిన టీఆర్ఎస్ నేతలు

    మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ను టీఆర్ఎస్ నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. మునుగోడులో బీజేపీ నేతలు డబ్బు పంచుతున్నారని ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, ఇతర టీఆర్ఎస్ నేతలు దాసోజు శ్ర‌వ‌ణ్‌, ర‌మేశ్ రెడ్డి చెప్పారు. కాగా, టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచుతున్నారని వికాస్ రాజ్ కు ఫోనులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఫిర్యాదు చేశారు.

  • 03 Nov 2022 03:37 PM (IST)

    వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్న ఈసీ

    మునుగోడు ఉప ఎన్నికలో ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీసి కనపడుతున్నారు. ఈసీ వెబ్ క్యాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోంది.

  • 03 Nov 2022 03:34 PM (IST)

    ఓటర్లలో స్ఫూర్తి నింపారు..

    అంగవైకల్యంతో బాధపడుతున్నప్పటికీ చక్రాల కుర్చీలపై పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, ఓటు హక్కును వినియోగించుకుని ఓటర్లలో స్ఫూర్తి నింపారు మునుగోడుకు చెందిన కొందరు ఓటర్లు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎన్నికల సంఘం ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

  • 03 Nov 2022 03:26 PM (IST)

    మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు 59.92 శాతం పోలింగ్ న‌మోదు

    మునుగోడు ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల‌ వరకు 59.92 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇవాళ ఉదయం పోలింగ్ తక్కువగా నమోదు కాగా, 11 గంటల నుంచి పెరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ కనపడుతోంది. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జరుగుతుంది.

  • 03 Nov 2022 02:27 PM (IST)

    సీఈవోకు మంత్రి జగదీష్‌ రెడ్డి ఫిర్యాదు

    మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ వేళ బీజేపీ నేతలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని సీఈవో వికాస్‌ రాజ్‌కు మంత్రి జగదీష్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారని, పంపిణీని అడ్డుకోవాలని జగదీష్ రెడ్డి సీఈవోకు ఇచ్చిన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.

  • 03 Nov 2022 01:28 PM (IST)

    సీఈవోకు బండి సంజయ్ ఫిర్యాదు..

    మునుగోడులో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు నగదు పంపిణీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ విషయమై ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి బయటి వ్యక్తులను తరలించడంలో అధికారుల నిర్లక్ష్యంపై సంజయ్ తీవ్ర నిరసన వ్యక్తంచేసినట్లు తెలిసింది.

  • 03 Nov 2022 01:18 PM (IST)

    మధ్యాహ్నం 1గంటకు 41.3శాతం పోలింగ్

    మునుగోడు ఉప ఎన్నికలో ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నంకు పుంజుకుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 1గంట సమయానికి 41.3శాతం పోలింగ్ నమోదైంది.

  • 03 Nov 2022 12:38 PM (IST)

    పోలింగ్ సరళిపై బండి సంజయ్ ఆరా..

    మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ సరళిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరా తీశారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో పలువురు నేతలతో సమావేశమైన సంజయ్ పోలింగ్ ఎంత వరకు జరిగింది? ఎలా కొనసాగుతోంది అనే విషయాలపై సమీక్షించారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులతో ఫోన్ లో సంజయ్ సంప్రదింపులు జరిపారు. పోలింగ్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.

  • 03 Nov 2022 12:18 PM (IST)

    ఓటు వేసిన కర్నె ప్రభాకర్ ..

    మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో బూత్ నెంబర్ 96లో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 03 Nov 2022 12:16 PM (IST)

    మొరాయించిన ఈవీఎంలు..

    చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మిషన్లు మొరాయించాయి. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు బారులు తీరారు. ఎంతకీ మిషన్లు అందుబాటులోకి రాకపోవటంతో అక్కడే కూర్చొని ఓటువేసేందుకు వేచిచూస్తున్నారు.

  • 03 Nov 2022 12:04 PM (IST)

    పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది : సీఈవో వికాస్‌రాజ్

    మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగాసాగుతోందని సీఈవో వికాస్ రాజ్ అన్నారు. ఉదయం 11గంటల వరకు 25.8శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. నియోజకవర్గంలో స్థానికేతరులు ఉన్నట్లు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని గుర్తించి నియోజకవర్గం నుంచి పంపించి వేశాం. ఆరుగురిపై కేసులు పెట్టాం. ఉప ఎన్నికపై ఇప్పటివరకు 28 ఫిర్యాదులు వచ్చాయి. రెండు చోట్ల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఓటు వేయడానికి డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా నేరమే. ఫేక్ న్యూస్ ప్రచారంపై పాల్వాయి స్రవంతి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టామని సీఈవో తెలిపారు.

  • 03 Nov 2022 11:52 AM (IST)

    నాపై తప్పుడు ప్రచారం: రాజగోపాల్ రెడ్డి

    మునుగోడు ఉప ఎన్నిక వేళ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు, నాంపల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పటికీ ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలుస్తారని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు.

  • 03 Nov 2022 11:49 AM (IST)

    మర్రిగూడలో ఘర్షణలతో పోలీసుల అలర్ట్..

    మర్రిగూడలో ఘర్షణలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ విధించారు.

  • 03 Nov 2022 11:38 AM (IST)

    11 గంటలకు 25.8 శాతం పోలింగ్

    మునుగోడు నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ క్రమంగా పుంజుకుంటోంది. ఉదయం 11గంటలకు 25.8శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • 03 Nov 2022 11:32 AM (IST)

    ఉంగరాలు ధరించి పోలింగ్ కేంద్రంలో కేఏ పాల్..

    మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనచేతికి ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు. కేఏ పాల్‌కు ఎన్నికల సంఘం ఉంగరాల గుర్తును కేటాయించిన విషయం విధితమే. అయితే.. ఉపఎన్నిక పోలింగ్ వేళ నియోజకవర్గంలో 100 పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లాలని పాల్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద పాల్ పరుగులు పెడుతున్నారు. మునుగోడు ప్రజలు మార్పుకోసం ఓటు వేయాలని కోరారు.

  • 03 Nov 2022 11:19 AM (IST)

    మార్ఫింగ్ ఫొటోపై కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు..

    మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్‌తో భేటీ అయినట్లు సోషల్ మీడియాలో కేసీఆర్, స్రవంతి ఫొటో వైరల్ గా మారింది. దీనిపై స్రవంతి సీఈవో వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీన్ని ధ్రువీకరించిన సీఈవో సంబంధిత మాధ్యమాలకు పంపి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇదిలాఉంటే తాను కేసీఆర్ తో భేటీ అయినట్లు ఫొటోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారికి నోటీసులు పంపిస్తానని పాల్వాయి స్రవంతి మీడియాకు తెలిపారు.

  • 03 Nov 2022 11:05 AM (IST)

    ఏ పార్టీవారు మాకు డబ్బులు ఇవ్వలే.. ఓటు వేయం..

    నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటువేసేందుకు ఓటర్ల అనాసక్తి. ఏ పార్టీవారు డబ్బులు ఇవ్వలేదని ఓటు వేయడానికి ఆసక్తి చూపని ఓటర్లు. ఊరు జనమంతా ఒకేచోట ఉండటంతో పోలీసులు రంగప్రవేశం. ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్న పోలీసులు

  • 03 Nov 2022 10:49 AM (IST)

    వేరువేరు ప్రాంతాల్లో నగదు పట్టివేత ..

    నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ. 10లక్షల నగదును గుర్తించారు. ఓ కారులో నగదు తరలిస్తుండగా బీజేపీ శ్రేణులు పట్టుకున్నారు. అదేవిధంగా చండూరులో డబ్బుల పంపిణీకి కొందరు యత్నించారు. డబ్బులతో పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. పోలీసులను చూసి రూ.2లక్షలు అక్కడే పడేసి పరారయ్యారు. రూ. 2లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • 03 Nov 2022 10:07 AM (IST)

    మునుగోడు జడ్పీ స్కూల్‌లో రాజగోపాల్ రెడ్డి ..

    మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు జడ్పీ స్కూల్‌లో పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ సరళిని రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.

  • 03 Nov 2022 09:49 AM (IST)

    ఉదయం 9గంటల వరకు 11.20 శాతం ఓటింగ్

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. కాగా.. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గం వ్యాప్తంగా 11.20 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 03 Nov 2022 09:40 AM (IST)

    మర్రిగూడ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    మర్రిగూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆందోళన వ్యక్తంచేసింది. స్థానికేతరులను వెంటనే పంపించాలని, అప్పటి వరకు పోలింగ్ ఆపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో మర్రిగూడెం పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది.

  • 03 Nov 2022 09:32 AM (IST)

    చండూరులో స్వల్ప ఉద్రిక్తత..

    మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చండూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికేతరులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి స్థానికేతరులు పరారయ్యారని వారు ఆరోపించారు. స్థానికేతర బీజేపీ నేతలే నియోజకవర్గంలో ఉన్నారంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు వారిని చెదరగొట్టారు.

  • 03 Nov 2022 09:19 AM (IST)

    వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన..

    మునుగోడు ఉప ఎన్నికను వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లో వెబ్ కాస్టింగ్ ను సీఈఓ వికాస్ రాజ్, డిప్యూటీ సీఈవో రవి కిరణ్ పరిశీలించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఒకరికంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్లు వెబ్ కాస్టింగ్ ద్వారా గమనించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలింగ్ కేంద్రం లోపల ఒక్క ఓటరు మాత్రమే ఉండేలా చూడాలని సీఈవో వికాస్ రాజ్ పోలింగ్ సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

  • 03 Nov 2022 08:46 AM (IST)

    రెండు చోట్ల ఈవీఎంలలో సమస్యలు

    మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. నియోజకవర్గంలో రెండు చోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని, పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది వెంటనే వాటిని సరిచేయడం జరిగిందని తెలిపారు.

  • 03 Nov 2022 08:33 AM (IST)

    శివాలయంలో రాజగోపాల్ రెడ్డి పూజలు ..

    మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు.

  • 03 Nov 2022 08:30 AM (IST)

    ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల

    మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెంలో ఓటు వేశారు.

  • 03 Nov 2022 07:41 AM (IST)

    ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. చండూరు మండలం ఇండికూడలో ఆమె ఓటు వేశారు.

  • 03 Nov 2022 07:13 AM (IST)

    మునుగోడు నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు..

    మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో.. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 23,914, చండూరు మున్సిపాలిటీలో 10,768 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అదేవిధంగా మండలాల వారిగాచూస్తే.. చౌటప్పల్ మండలంలో 35,519 మంది ఓటర్లు, నారాయణపురం మండలంలో 36,430, మునుగోడులో 35,780, చండూరులో 22,741, మర్రిగూడలో 28,309 మంది ఓటర్లు, నాంపల్లి మండలంలో 33,819 మంది, గట్టుప్పల మండలంలో 14,525 మంది ఓటర్లు ఉన్నారు.

  • 03 Nov 2022 07:00 AM (IST)

    మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్

    మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.