3వ కరోనా రిలీఫ్ ప్యాకేజీ వివరాలివే..రైతులకు మంచి ధరల కోసం సంస్కరణలు

కోవిడ్-19 మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో మూడవ విడత ఉద్దీపన చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం(మే-15,2020)ప్రకటించారు. వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలకు, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఊతమిచ్చేలా ఉద్దీపన చర్యలను ఆమె ప్రకటించారు.
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు 11 ఫార్ములా అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.1 లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా ప్రకటించారు. శీతల గోదాముల ఏర్పాటుకు ఈ నిధులను వినియోగించనున్నారు. దీర్ఘకాలిన వ్యవసాయ మౌళికసదుపాయాల కోసం స్వల్ప కాలిక పంట రుణాలపై దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంతో పోటీ పడటంలో భారత్ ను ముందు వరుసలో ఉంచింది రైతులేనని కొనియాడారు. వాతావరణ సమస్యలను అధిగమించి కష్టపడుతున్నారన్నారు.
లాక్‌డౌన్ కాలంలో పీఎం కిసాన్ ఫండ్ కింద రైతుల ఖాతాల్లో రూ. 18,730 కోట్లను జమచేయడంతో పాటు రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. పండించిన పంటలకు రైతులకు మంచి ధర దక్కేలా నిత్యావసర వస్తువుల చట్టంలో అవసరమైన సవరణలు తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. ఈసీ యాక్ట్ 1955లో సవరణలు చేయనున్నట్లు చెప్పారు. తృణధాన్యాలు, తినదగిన నూనెలు, నూనెగింజలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయాలు, బంగాళాదుంపలతో సహా వ్యవసాయ ఆహార పదార్థాలు ఈ చట్టం కింద నియంత్రించబడతాయన్నారు. తీవ్ర విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఆహార పదార్థాల నిల్వపై నిషేధం ఉంటుందన్నారు.
దేశంలోని సూక్ష్మ ఆహార సంస్థలకు సంస్ధలకు(micro food enterprises) రూ. 10 వేల ప్యాకేజీని ఈ సందర్భంగా నిర్మలా ప్రకటించారు. స్థానిక వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలన్న ప్రధాని లక్ష్య సాధనకు అనుగుణంగా 2లక్షల ఎంఎఫ్ఈలకు సాయం చేసేందుకు ఈ పథకం ప్రారంభించబడుతున్నట్లు ఆమె తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలను అందుకునేందుకు వీలుగా ఎంఎఫ్‌ఈలను సాంకేతికంగా అభివృద్ధి చేయడం, బ్రాండ్లు కల్పించి మార్కెట్ సదుపాయాలు కల్పించడం, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు కల్పించడం, ప్రాంతానికి అనుగుణంగా ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి ఈ పథకం కింద చేపట్టనున్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో మామిడి, జమ్ముకశ్మీర్‌లో కేసర్, ఈశాన్యంలో వెదురు, ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి, తమిళనాడులో కర్రపెండలం వంటి వాటిని ప్రోత్సహించనున్నట్లు ఆమె ప్రకటించారు.
రూ. 500 కోట్లతో ఆపరేషన్ గ్రీన్ విస్తరణను చేపట్టినట్లు నిర్మలా తెలిపారు. లాక్‌డౌన్ వల్ల వస్తువుల సరఫరా చైన్‌కు ఆటంకం తలెత్తిందన్నారు. రైతులు తాము పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరల తగ్గుదల, అమ్ముడుపోవడం లేదన్న బాధను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ స్కీం కింద వివిధ మార్కెట్లకు తరలించే నిమిత్తం రవాణపై 50 శాతం సబ్సిడి కల్పిస్తున్నట్లు తెలిపారు. నిల్వ చేసుకునేందుకు శీతల గోదాముల్లో నిల్వపై సహా 50 శాతం సబ్సిడీని కల్పిస్తున్నామన్నారు. రైతులకు మంచి ధరలు దక్కేలా చూడటం, వ్యర్థాలు తగ్గించడం అదేవిధంగా వినియోగదారులకు అందుబాటు ధరలో లభించేలా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని నిర్మలా తెలిపారు.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకానికి 20 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సముద్ర, ఆక్వా, చేపల చెరువుల సమగ్ర, సుస్థిర అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. మెరైన్, ఇన్‌ల్యాండ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ కోసం 11వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఫిషింగ్ హార్బర్స్, కోల్డ్ చెయిన్స్, మార్కెట్ల కోసం మరో 9 వేల కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మత్స సంపద యోజన పథకం ద్వారా రానున్న 5ఏళ్లలో దాదాపు 70 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విధానం వల్ల సుమారు 55 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే ఛాన్సు ఉన్నది. అంతేకాదు, మత్స్య పరిశ్రమకు సంబంధించిన ఎగుమతుల విలువ సుమారు లక్ష కోట్లు దాటుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు.
మత్స్యకారులకు బీమా సౌకర్యం, పశుసంవర్ధక మౌలిక వసతులకు రూ 15,000 కోట్లు, పశువులు, జీవాలకు వ్యాక్సిన్‌ల కోసం రూ 13,300 కోట్లు,ఔషధ మొక్కల సాగుకు రూ 4000 కోట్లతో నిధి, తేనెటీగల పెంపకందారులకు రూ 5000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. స్ధానిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం రూ 10,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
డెయిరీ రైతులకు రూ 5వేల కోట్లతో అదనపు సాయం అందిచనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 2 కోట్ల మందికి దీని ద్వారా లబ్ధి కలగనున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే పాల ఉత్తత్తిలో భారత్ నెంబర్1 అన్న ఆమె..లాక్ డౌన్ వేళ పాల ఉత్పత్తి 25 శాతం తగ్గిందన్నారు.
Read Here>> ఆర్థిక సంక్షోభానికి.. నగదు ముద్రణే పరిష్కారం!