రాజస్ధాన్ లో బర్డ్ ఫ్లూ కలకలం – నెలలో 5వేల పక్షులు మృతి

రాజస్ధాన్ లో బర్డ్ ఫ్లూ కలకలం – నెలలో 5వేల పక్షులు మృతి

Updated On : January 17, 2021 / 6:47 PM IST

Over 5,000 birds died in Rajasthan in less than a month : రాజస్ధాన్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఏవియన్ ఫ్లూ ప్రభావం కారణంగా పక్షులు నేల రాలుతున్నాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 215 పక్షులు మృతిచెందగా…గడిచిన నెల రోజుల్లో 5 వేలకు పైగా పక్షులు మృత్యువాత పడినట్లు పశు సంవర్దక శాఖ అధికారులు తెలిపారు. పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు బర్డ్ ఫ్లూ సోకి చనిపోవటంతో యాజమానులు  తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు.

ఏవియన్‌ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు హైఅలర్ట్‌ ప్రకటించాయి. ఇతర రాష్ట్రాల నుంచి పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించాయి. దీంతో దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగం గడ్డు పరిస్ధితిని ఎదుర్కోంటోంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి చెందకుండా పౌల్ట్రీ ఫామ్‌లను, జూలను, నీటి వనరులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని గత నెల 11న ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. వైరస్‌ కట్టడికి రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.