Tamil Nadu Govt Vs Governor Ravi : గవర్నర్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించండీ : రాష్ట్రపతికి మెమోరాండం ఇచ్చిన సీఎం స్టాలిన్ ప్రభుత్వం
గవర్నర్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ రాష్ట్రపతికి తమిళనాడులోని సీఎం స్టాలిన్ ప్రభుత్వం మెమోరాండం సమర్పించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి గవర్నర్ పదవిలోఉండటానికి అనర్హడు అంటూ పేర్కొంది.

_Sack Governor Immediately..Tamil Nadu Govt Vs Governor RN Ravi
Tamil Nadu Govt Vs Governor Ravi : ఇప్పటికే తెలంగాణలో గవర్నర్ పై పలు విమర్శలు వస్తున్న క్రమంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో కూడా ఇటువంటి డిమాండ్ వచ్చింది. తమిళనాడు గవర్నర్ ను ఆర్ఎన్ రవిని బర్త్ రఫ్ చేయాలని అధికార పార్టీ డీఎంకే రాష్ట్రపతికి మెమోరాండం ఇచ్చింది. గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని..గవర్నర్ శాంతికి ముప్పు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇచ్చిన మెమోరాండంలో పేర్కొంది డీఎంకే పార్టీ. గవర్నర్ ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కోరింది. గవర్నర్ మత విద్వేషాలను రెచ్చగొట్టారని డీఎంకే ఆరోపించింది. రాజ్యాంగాన్ని గవర్నర్ రవి ఉల్లంఘిస్తున్నారని..ఆయన వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదని ఆయన వ్యాఖ్యలు శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉన్నాయని పేర్కొంది అధికారి డీఎంకే పార్టీ..
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం పలకకుండా పెండింగ్ లో పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెల్లడించిది. బిల్లులకు ఆమోదం పలకకుండా అనవసరంగా జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించటానికి గవర్నర్ రవి ఇలా చేస్తున్నారని..ఇటువంటి చర్యల్ని దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చని సీఎం స్టాలిన్ ప్రభుత్వం పేర్కొంది. ఇటువంటి వ్యవహార శైలితో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అఘాతం వచ్చే అవకాశాలున్నాయని..దానికి గవర్నర్ వ్యవహార శైలి ఉందని ఇటువంటి వ్యక్తి గవర్నర్ పదవికి అనర్హుడని ఆయనను వెంటనే పదవినుంచి తొలగించాలని రాష్ట్రపతికి ఇచ్చిన మెమోరాండంలో కోరింది ప్రభుత్వం.కానీ ఈ మెమోరాండంపై గవర్నర్ ఆర్ఎన్ రవి స్పందించలేదు.
కాగా తెలంగాణ,తమిళనాడు, కేరళలో అధికార పార్టీలు, గవర్నర్ల మధ్య అంతరం రోజు రోజుకూ పెరిగిపోతోంది. పాలక పక్షాలు తమ సొంత రాష్ట్రాల్లో గవర్నర్‌ను ఎదుర్కోవడమే కాకుండా పార్టీ శ్రేణులు, రాష్ట్రాలకు అతీతంగా మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మూడు దక్షిణాది రాష్ట్రాల గవర్నర్‌లు కీలకమైన చట్టాల విషయంలో ‘కేంద్రం చెప్పినట్టు తోలుబొమ్మల్లా’ వ్యవహరిస్తున్నారని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. గవర్నర్‌కు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను ఆయా పాలక పక్షాలు ప్రశ్నిస్తున్న క్రమంలో కేంద్రం నియమించిన గవర్నర్లపై ఈ మూడు రాష్ట్రాల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. గవర్నర్లను తొలగించాలని అసలు గవర్నర్ వ్యవస్థనే తొలగించాలని తెలంగాణలో డిమాండ్ వినిపిస్తోంది.
కేరళ, తెలంగాణ, తమిళనాడు ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య పలు అంశాలపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు సంబంధించిన ఉమ్మడి బోర్డు బిల్లు విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, తెలంగాణ గవర్నర్‌పై తమిళనాడులోని అధికార డీఎంకే స్పందించింది.
‘రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినందుకు’ గవర్నర్ ఆర్‌ఎన్ రవిని తొలగించాలనే డిమాండ్‌తో డీఎంకే నవంబర్ ప్రారంభంలో చేసిన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ సారూప్యత కలిగిన ఎంపీలందరికీ లేఖ రాసింది. అతని చర్యలు, వ్యాఖ్యలు గవర్నర్ పదవికి అనర్హుడిగా చూపుతున్నాయని, భావసారూప్యత గల ఎంపీలందరూ తమ ప్రతిపాదనకు మద్దతుగా సంతకాలు చేయాలని కోరింది.
తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించి ఆమోదించిన 20కిపైగా బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. నీట్ నుంచి మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో రెండుసార్లు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్ తనవద్దే ఉంచుకోవడం పట్ల ఆయనకు వ్యతిరేకంగా ఏప్రిల్‌లో డీఎంకే నేతలు ఆందోళనలు నిర్వహించారు.
తమిళనాడులో పరిస్థితి అలా ఉంటే ఇక్కడ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తున్నారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం మొత్తం 15 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డుపై చర్చించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆమె పిలిపించారు. గత మూడేళ్లుగా అనేకసార్లు గుర్తుచేసినా ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని మంత్రిని సౌందరరాజన్ ప్రశ్నించారు.వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు నేరుగా భర్తీకి అనుమతించే బిల్లును తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. దానిపై సంతకం చేయడానికి ఆమె నిరాకరించడం గవర్నర్ పై గుర్రుగా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు ఇలా ఉంటే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ సౌందరరాజన్ ఆరోపిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తనకు అనుమతి లేదన్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు. టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఎంపిక చేస్తూ క్యాబినెట్ పంపిన తీర్మానాన్ని తమిళిసై తిప్పి పంపారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.
ఈ రెండు రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉంటే మరోపక్క కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, పినరయి విజయన్ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సోమవారం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని..సీపీఎం నాయకులకు తనపై దాడి చేసే దమ్ముందా? అంటూ సవాల్ విసిరారు. ఇటువంటి వ్యాఖ్యలు గవర్నర్ కు తగునా? అంటూ పినరాయి విజయన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఇలా తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో గవర్నర్ల పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.