సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్, ఈ-పాస్‌లు ఇస్తున్న తెలంగాణ పోలీసులు

లాక్ డౌన్ కారణంగా చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఇరుక్కుపోయారు. విద్యార్థులు, జాబ్ పని మీద వచ్చిన వారు, టూరిస్టులు రాష్ట్రంలో ఉండిపోవాల్సి వచ్చింది. వారు తమ సొంత ప్రాంతానికి వెళ్లలేకపోయారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు గుడ్ న్యూస్ వినిపించారు. వారి కోసం ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు అవసరమైన అనుమతుల విధానాన్ని తెలంగాణ పోలీస్ శాఖ సులభతరం చేసింది. ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకునేందుకు సదుపాయాన్ని డీజీపీ కార్యాలయం అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ పోలీస్ డిజిటల్ పాస్ మేనేజ్ మెంట్ సిస్టమ్ పేరిట వెబ్ సైట్ లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు.
తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఈ-పాస్ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ-పాస్ అవసరమైన వారు సంబంధిత పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందన్నారు.
ఆన్‌లైన్‌లో పొందుపర్చిన వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత ఆన్‌లైన్‌లోనే ఈ పాసులు జారీ చేస్తామని, వాటి సాయంతో సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. వెబ్ సైట్ లో ”లాక్ డౌన్ ఈ-పాస్” ఆప్షన్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి. దీని ద్వారా ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు, నిత్యావసర సరుకుల సరఫరా కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు.