తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు నిలిపివేత, కారణం ఇదే

తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు నిలిపివేత, కారణం ఇదే

Updated On : July 12, 2025 / 4:10 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా టెస్టులు ఆపేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ టెస్టుల్లో కచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేకపోవడం, పాజిటివ్ లకు నెగిటివ్, నెగిటివ్ లకు పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ్టి(జూలై 2,2020) నుంచి 5వ తేదీ వరకు అంటే నాలుగు రోజులపాటు శాంపిల్స్‌ సేకరణ నిలిపివేస్తున్నట్టు ప్రైవేట్ ల్యాబ్స్ వెల్లడించాయి. సిబ్బందికి కరోనా శాంపిల్స్ సేకరణపై శిక్షణ, డిస్ ఇన్ ఫెక్షన్ కార్యక్రమాల కోసం కరోనా పరీక్షలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాయి ప్రైవేట్ ల్యాబ్స్. కాగా, కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పాటించడం లేదని ఇప్పటికే 12 ల్యాబ్ లకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కరోనా నిర్ధారణ పరీక్షల్లో తప్పులు:
తెలంగాణ రాష్ట్రంలో 18 ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత 15 రోజుల నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం ప్రైవేటు ల్యాబ్‌ల కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించి.. లోపాలను గుర్తించింది. 48 గంటల్లో లోపాలను సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ల్యాబ్‌లు తప్పులను సరిదిద్దుకున్నాయి.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, శానిటైజేషన్:
ఇంకా కొన్ని ల్యాబుల్లో పరిస్థితిలో మార్పు లేదు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా శాంపిల్స్‌ సేకరించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు డిస్ ఇన్‌ఫెక్షన్‌(శానిటైజేషన్) కోసం నాలుగు రోజుల పాటు స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ల్యాబ్‌లు ప్రకటించాయి. ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది శాంపిల్స్‌ సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాయి. నేరుగా ల్యాబ్‌కు వచ్చి పరీక్షలు చేయించుకేనే అనుమానితుల శాంపిల్స్‌ మాత్రం సేకరించబోమని స్పష్టం చేశాయి. జూలై 6 నుంచి తిరిగి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించాయి.

ప్రైవేట్ ల్యాబుల్లో 70శాతం నమూనాలు పాజిటివ్ రావడంపై అనుమానాలు:
కాగా, ప్రైవేట్ ల్యాబ్ లలో కరోనా నిర్ధారణ పరీక్షలపై ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది. ప్రైవేట్ ల్యాబుల్లో చేసే కరోనా పరీక్షల్లో 70 శాతం నమూనాలు పాజిటివ్ రావడం అనుమానం కలిగిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రెండు, మూడు రోజుల్లో ప్రైవేట్ ల్యాబ్ లు ఇచ్చిన ఫలితాలపై నిజానిజాలు తెలుసుకుంటామన్నారు. కరోనా టెస్టులు చేస్తున్న ప్రైవేట్ ల్యాబ్‌ల పని తీరుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నియమించిన కమిటీ తనిఖీల్లో చేసింది. ఈ తనిఖీల్లో మార్గదర్శకాలు పాటించకుండా పరీక్షలు చేస్తున్న పలు లాబ్‌లను గుర్తించిన సంగతి తెలిసిందే. కొన్ని ల్యాబుల్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 70 శాతం పాజిటివ్ రావడంపై పరీక్షా విధానంలో లోపాలు ఉన్నాయేమో అని నిపుణుల కమిటీ సునిశితంగా పరిశీలన చేయనుంది. అనంతరం ఆ లోపాలను, నివారణ చర్యలు కూడా కమిటీ సూచించనుంది.

ప్రైవేట్ ల్యాబ్‌లకు మంత్రి వార్నింగ్:
ఈ అంశాలపై సమీక్షించిన మంత్రి ఈటల రాజేందర్ తప్పులు చేస్తున్న ల్యాబ్‌లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవకతవకలు గుర్తించిన పలు ల్యాబ్‌లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్‌లలో జరుగుతున్న పరీక్షల తీరుపై ప్రభుత్వ ల్యాబ్‌ల మాదిరిగా నిరంతర పర్యవేక్షణ, తరచుగా వాలిడేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అన్నీ ల్యాబులు ఐసీఎంఆర్, ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ ల్యాబ్‌లు లోపాలు సరిదిద్దుకొకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

 

Read:No Mask : తెలంగాణలో ఎన్ని కేసులో తెలుసా