Today HeadLines : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరికలు

రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పార్టీలో చేరిన నేతలు.

Today HeadLines : చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరికలు

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరికలు
కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు, ఆదోనికి చెందిన శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు.. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పని చేస్తామని చంద్రబాబుకి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు పార్టీలో చేరిన నేతలు.

లోక్‌సభ ఎన్నికల్లోనూ మద్దతు ఇస్తాం: కోదండరాం
లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతతు ఇస్తామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. గవర్నర్ కోటాలో తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇక..: ఉత్తమ్
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలుస్తుందని, బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుందని చెప్పారు.

గణతంత్ర వేడుకల్లో చంద్రబాబు..
ఉండవల్లిలోని నివాసంలో గణతంత్ర వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.

విషాదం..
ములుగు జిల్లాలో గణతంత్ర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో ముగ్గురు విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. గాయలైన వ్యక్తిని హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి సీతక్క పరామర్శించారు.

స్పీకర్ కు పరామర్శ..
స్పీకర్ గడ్డ ప్రసాద్ ను  సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అదేవిధంగా ఇటీవల గుండెపోటుతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని రేవంత్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

పబ్లిక్ గార్డెన్స్ లో..
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఈ వేడుకలకు హాజరయ్యారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు హాజరయ్యారు. జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు.

అభినందనలు..
తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తమ అద్భుత ప్రతిభ, నైపుణ్యంతో తెలంగాణ సంస్కృతి కళల గురించి దేశానికి చాటిచెప్పారని ప్రశంసించారు. అదేవిధంగా పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన హరికథా కళాకారిణి డి. ఉమామహేశ్వరికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు.

దర్శనం వేళల్లో మార్పులు ..
భక్తుల రద్దీ నేపథ్యంలో అయోధ్యలోని బాలక్ రామ్ మందిరంలో స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు పొడిగించారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చునని గురువారం తెలిపారు. ఇప్పటి వరకు ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు, మధ్యలో రెండు గంటల విరామంతో ఆలయ వేళలు ఉండేవి.

పురస్కారాలు ..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రపతి పురస్కారాలకు 23 మంది తెలంగాణ అధికారులు, సిబ్బంది ఎంపికయ్యారు. వీరిటిలో ఆరుగురికి శౌర్య పతకాలు, ఇద్దరికి అత్యుత్తమ సేవా పతకాలు, 14 మందికి ఉత్తమ సేవా పురస్కారాలు దక్కాయి.

బండి సంజయ్ శుభాకాంక్షలు ..
పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిలకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన కూరెళ్ల విఠలాచార్య, గడ్డం సమ్మయ్య, కేతవత్ సోమ్ లాల్, వేలు ఆనంద చారి, దాసరి కొండప్పలకు శుభాకాంక్షలు తెలిపారు.