బెజవాడలో రౌడీ షీటర్ల ఏరివేత సత్ఫలితాలిచ్చేనా ?

  • Published By: murthy ,Published On : July 27, 2020 / 07:41 PM IST
బెజవాడలో రౌడీ షీటర్ల ఏరివేత సత్ఫలితాలిచ్చేనా ?

Updated On : July 27, 2020 / 8:10 PM IST

గ్యాంగ్‌ వార్‌ ఘటనతో బెజవాడ పోలీసులు దూకుడు పెంచారు. రౌడీషీటర్స్‌, రౌడీ మూకలపై ఉక్కుపాదం మోపుతున్నారు. బెజవాడలో ఒక్కొక్కరిగా రౌడీ షీటర్‌ల ఎరివేత కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే పలువురిని నగర బహిష్కరణ చేసిన పోలీసులు..మరికొందరి భరతం పట్టే పనిలో పడ్డారు. నగర బహిష్కరణ చేసిన రౌడీషీటర్లు మళ్లీ యాక్టివ్‌గా మారితే తాటా తీస్తామని హెచ్చరిస్తున్నారు.

బెజవాడ పేరు చెబితే…ముందుగా గుర్తుకు వచ్చేది రౌడీయిజమే. దేశ వ్యాప్తంగా ఈ బెజవాడ పేరు వినపడగానే…అమ్మో బెజవాడ అని అంటారు. అలాంటి బెజవాడలో ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది.

గ్యాంగ్ వార్‌లు, అలజడలు చేస్తూ రెచ్చిపోతున్న రౌడీలపై సీపీ శ్రీనివాసులు ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఇప్పటికే విజయవాడ కమీషనరేట్ పరిధిలో ఐదుగురు రౌడిషీటర్స్‌ను నగర బహిష్కరణ చేసిన పోలీసులు… మాట వినని వారిపై తమదైన శైలిలో కొరడా ఝలిపిస్తున్నారు.

విజ‌య‌వాడ న‌గ‌ర క‌మీష‌న‌రేట్ ప‌రిధిలో దాదాపు 470 మంది రౌడీషీటర్స్ ఉన్నారు. ఇందులో దాదాపు 80 మంది వరకు యాక్టివ్‌గా ఉన్నారు. అయితే బెజవాడలో రౌడీ షీటర్స్‌ ఏరివేత చేపట్టిన పోలీసులు…ప్రతి పోలీస్ స్టేషన్‌లో న‌మోదైన రౌడీషీటర్ల లిస్ట్‌ను బ‌య‌ట‌కు తీసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

ఇక‌పై న‌గ‌రంలో ఏ రౌడీ షీట‌రైన నేరాల‌కు పాల్పడితే క‌ఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంద‌న్న హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు. అయితే ఈ హెచ్చరిక‌ల‌ను ప‌ట్టించుకోని ఐదుగురు రౌడీషీటర్స్‌ను నగర బహిష్కరణ చేశారు.

ఇందులో కృష్ణలంక పీఎస్‌ ప‌రిధిలో భూప‌తి చంద్రశేఖర్ అలియాస్ దొంగ చందు, గ‌న్నవ‌రం పీఎస్ ప‌రిధిలో ప‌ఠాన్ యూస‌ఫ్ ఖాన్ అలియాస్ యూస‌ఫ్ బిడ్డి, భ‌వానీపురం పీఎస్ ప‌రిధిలో ఉన్న రౌడీషీట‌ర్ గుంటూరు ప్రవీణ్ కుమార్, నున్న పోలీస్ స్టేషస్ పరిధిలోని నెలటూరు కోటేశ్వరరావు, పెన‌మ‌లూరు పీఎస్ ప‌రిధిలో ఉన్న గ్యాంగ్ వార్ ఘ‌ట‌న‌లో ఉన్న మ‌రో రౌడీ షీట‌ర్ ఉన్నారు.

ఈ ఐదురుగు ఆరు నెల‌ల‌పాటు బెజ‌వాడ‌లో అడుగుపెట్టకుండా చ‌ర్యలు తీసుకున్నారు. ఆ త‌ర్వాత కూడా నేరాల‌కు పాల్పడితే క‌ఠిన శిక్షను అమ‌లు చేస్తామ‌ని రౌడీషీట‌ర్లను హెచ్చరించారు.అయితే నగర బహిష్కరణ చేసినా…ఐ డోంట్‌ కేర్‌ అంటూ రౌడీషీటర్‌ సతీశ్‌….గంజాయిని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

విజయవాడలోని దేవినగర్ మధ్యకట్ట వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సతీశ్‌పై గతంలోనే అజిత్‌సింగ్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 21 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సారి ఎన్‌డి పీఎస్ యాక్ట్‌తో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల జరిగిన గ్యాంగ్‌వార్ ఘ‌ట‌న‌ల‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు…రౌడీ మూక‌ల ప‌ట్ల క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. బెజవాడలో నేరాల‌ను అరిక‌ట్టడానికి ముమ్మర ప్రయ‌త్నం చేస్తున్నారు.
మరి పోలీసులు ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.