వేగంగా నడవండి.. ఆరోగ్యంగా ఉండండి

ఎప్పుడూ నిదానంగా నడుస్తుంటారా? వేగంగా నడవలేకపోతున్నారా? అయితే ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. నడక వేగాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ పరిశోధనలేంటో తెలుసా..? మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు అంటారు. అదేవిధంగా నడిచే నడకను బట్టి వాళ్లు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో చెప్పొచ్చంటున్నారు పరిశోధకులు.
ఈ పరిశోధన కోసం కోట్ల రూపాయలు కర్చు చేస్తూ ఆసక్తికరమైన విషయాలను బయట పెడుతున్నారు. మనుషులు ఎలా నడుస్తున్నారో తెలుసుకునేందుకు అక్షరాలా రూ.16.44కోట్ల ఖర్చు చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. షెఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు నడకపై కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నానికి తనవంతు సాయం అందించింది. మనిషి ఎలా నడుస్తాడన్న అంశాన్ని శాస్త్రీయ పరిభాషలో గతిశీలత అని అంటారు. ఇది వ్యక్తుల ఆరోగ్యాన్ని అంచనావేసే అంశాల్లో కీలకమైనది.
మెల్లగా నడిచేవారు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందన్నది సైంటిస్టులు గుర్తించారు.. అలా నడిచేవారికి రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువని చెప్పారు. నెమ్మదిగా అడుగులేసే వారిలో మతిమరుపు వచ్చే రిస్క్ పెరుగుతుంది. బరువు పెరగకుండా, నాజూగ్గా ఉండడానికే కాదు.. రకరకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి కూడా నడక ఉపయోగకరమైంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా నడక మంచి వ్యాయామం. ప్రతిరోజూ కనీసం అరగంట వేగంగా నడిస్తే అనేక రకాల ఆరోగ్య ఫలితాలుంటాయి. శరీరంలోని ప్రతి అవయవమూ వాకింగ్ వల్ల పునరుత్తేజం చెందుతుంది. రోజూ నడవడం వల్ల గుండె నుంచి ఎముకల దాకా ఆరోగ్యం చేకూరుతుంది. వారం మొత్తంలో నాలుగు గంటలు నడిస్తే తుంటి ఎముక ఫ్రాక్చర్ల అవకాశాన్ని 43 శాతం తగ్గించవచ్చని చెప్తున్నారు ఫిట్ నెస్ నిపుణులు.
బరువు తగ్గించే సులువైన మార్గం ప్రతిరోజూ వాకింగ్ కి వెళ్లడం. ఖర్చు లేని సులభమైన వ్యాయామం వేగంగా నడవడం. ప్రతిరోజూ ఒక 75 నిమిషాల పాటు వేగంగా నడిస్తే మీ జీవిత కాలంలో మరో రెండేళ్లు అదనంగా కలుపవచ్చు. వారానికి మూడు సార్లు 40 నిమిషాల పాటు నడిస్తే మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయి.
ఏ వ్యాయామానికైనా వార్మప్ చాలా ఇంపార్టెంట్. అలా అని డైరెక్ట్ గా బ్రిస్క్ వాక్ చేయడం కరెక్ట్ కాదు. నడక పూర్తిగా అలవాటు లేనివారు ఒక్కసారిగా నడవడం మంచిది కాదు. మొదట పదినిమిషాలు, పావుగంటతో మొదలు పెట్టి తరువాత వారానికి ఒకసారి ఈ టైం పెంచుతూ పోవాలి. రోజూ అరగంటైనా వేగంగా నడవండి.. ఆరోగ్యంగా ఉండండి అని సూచిస్తున్నారు అధ్యయనకారులు.