Abortion : గర్భస్రావం తరువాత అశ్రద్ధ వద్దు!..

గర్భస్రావం అయిన తరువాత వెంటనే గర్భం దాల్చేందకు ప్రయత్నించటం ఏమంత శ్రేయస్కరం కాదు. పూర్తి స్ధాయిలో ఆరోగ్య పరంగా కోలుకున్నాకే ఆ ఆలోచన చేయటం మంచిది.

Abortion : గర్భస్రావం తరువాత అశ్రద్ధ వద్దు!..

Pregnent

Updated On : January 2, 2022 / 11:44 AM IST

Abortion : గర్భం దాల్చి అంతా సజావుగా సాగుతోందనుకుంటోన్న సమయంలో అకస్మాత్తుగా అబార్షన్‌ జరిగితే కొందరు శారీరకంగానే కాదు.. మానసికంగా కృంగుబాటుకు గురవుతారు. ఇటీవలి కాలంలో గర్భస్రావం అనేది కామనై పోయింది. మారిన జీవన , ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరికి గర్భస్రావం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

అనుకోని పరిస్ధితుల్లో గర్భస్రావం జరిగితే మానసికంగా ఏమాత్రం కుంగిపోకూడదు. కొందరు మహిళలు గర్భస్రావమే కదా అన్న ఉద్దేశంతో రెండుమూడు రోజుల్లోనే తమరోజువారి పనులు చేయడం మొదలు పెడతారు. అయితే అలా చేయటం ఏమంత శ్రేయస్కరం కాదు. సౌకర్యంగా అనిపించేంత వరకూ విశ్రాంతి తీసుకోవడమే మంచిది.

గర్భస్రావం సందర్భంలో నొప్పితోపాటు, నెలసరిలో వచ్చినట్లుగానే రక్తస్రావం జరుగుతుంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఏమాత్రం ఇబ్బంది తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. గర్భస్రావం తరువాత చాలా మంది మహిళలు ఆలోచనలు, ఉద్వేగాలకు లోనవుతుంటారు. ఇది ఏమాత్రం మంచిదికాదు. పదేపదే అదే ఆలోచనతో నిద్రపట్టకపోవటం, ఆకలి లేకపోవటం, ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతుంటే ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా మానసిక వైద్యునిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవటం ఉత్తమం.

గర్భస్రావం అయిన తరువాత వెంటనే గర్భం దాల్చేందకు ప్రయత్నించటం ఏమంత శ్రేయస్కరం కాదు. పూర్తి స్ధాయిలో ఆరోగ్య పరంగా కోలుకున్నాకే ఆ ఆలోచన చేయటం మంచిది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు గర్భస్రావాలు అయినప్పుడు గర్భం దాల్చేముందు, డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి. గర్భస్రావం తరువాత ఆరోగ్యపరమైన జీవన విధానంపై దృష్టి సారించటం మంచిది. సాధ్యమైనంత వరకూ అన్నిరకాల పోషకాలు లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. శరీర బరువు అదుపులో ఉండేలా చూసుకోవాలి.

ఒకటికన్నా ఎక్కువగా గర్భస్రావాలు జరిగితే మళ్లీ అలాంటి సమస్య ఎదురుకాకుండా దానికి కారణాలు తెలుసుకున్న తరవాత గర్భం దాలిస్తే, పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు. వైద్యుల సూచనలు , సలహాలు ఎప్పటికప్పుడు పాటించటం మంచిది. అవసరాన్ని బట్టి హార్మోన్లూ, రోగనిరోధశక్తికి సంబంధించిన సమస్యల్ని తెలుసుకునేందుకు వైద్యులు రక్త పరీక్షలు సూచిస్తారు. గర్భాశయం పనితీరు తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేస్తారు.