Infertility Problem : మందుబాబులకు షాక్…మద్యం తాగితే సంతానలేమి సమస్య

మద్యం మొగుడు,పెళ్ళాల మధ్య కయ్యాలు పెట్టటమే కాకుండా కొత్తగా పిల్లలు పుట్టకుండా కూడా చేస్తుందన్న విషయం ఈ అధ్యయనం ద్వారా తేల్చారు.

Infertility Problem : మందుబాబులకు షాక్…మద్యం తాగితే సంతానలేమి సమస్య

Drinking Alcohol

Updated On : February 18, 2022 / 11:41 AM IST

Infertility Problem : పెళ్ళైన వారిలో చాలా మంది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లయినవారిలో పిల్లలు పుట్టకపోవడానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల ద్వారా హార్మోన్ల సమస్య, పర్యావరణ పరిస్థితులు, ఇలా అనేక కారణాలు ఈ సంతానలేమి సమస్యకు దారితీస్తున్నట్లు తేల్చారు. చిన్నవయస్సులోనే అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారిలో సంతనలేమి సమస్య అధికంగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది.

అయితే తాజాగా మన దేశంలోని తమిళనాడులోని ఓ పరిశోధన బృందం సంతానలేమికి కారణాలు కనుగొనేందుకు ఓ అధ్యయనాన్ని చేపట్టింది. ఆ అధ్యనంలో అనేక ఆసక్తి కరమైన విషయాలు బయటపడ్డాయి. సంతాన లేమికి మద్యం మహమ్మారి కూడా ఒక కారణమని వారు తేల్చారు. చెన్నైలోని చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, చెట్టినాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధ్వర్యంలో పరిశోధన బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. దీనిపై వారు ఓ జర్నల్ ను కూడా ప్రచురించారు. ప్రస్తుతం ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మద్యం మొగుడు,పెళ్ళాల మధ్య కయ్యాలు పెట్టటమే కాకుండా కొత్తగా పిల్లలు పుట్టకుండా కూడా చేస్తుందన్న విషయం ఈ అధ్యయనం ద్వారా తేల్చారు. దేశ వ్యాప్తంగా చాలా మంది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్న వారు అధికంగానే ఉన్నారు. ఈ నేపధ్యంలో అసలు కారణాలు కనుగొనే దిశగా ఈ బృందం కూలంకుషమైన పరిశోధన జరిపింది. సంతానలేమితో బాధపడుతున్న మొత్తం 231 మంది మగవారిపై అధ్యయనం చేశారు. వారి నుండి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. సీమెన్, స్పెర్మ్, పరీక్షలు నిర్వహించి విశ్లేషించారు. మద్యం అలవాటులేనివారితో పోల్చితే మద్యం తాగేవారిలో వీర్యం పరిమాణం, వీర్యకణాల నాణ్యత బాగా తక్కువగా ఉన్నట్లు తేలింది.

మద్యం సేవించే వారిలో వీర్యకణాల వృద్ధి, సంఖ్య, తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై లోతైన విశ్లేషణ చేసిన వారికి టెస్టోస్టిరాన్‌ హార్మోన్లను విడుదలచేసే వృషణంలోని లెడిగ్‌ కణాలపై ఆల్కహాల్‌ ప్రభావం చూపుతుందని గుర్తించారు. వీర్యం విడుదలకు కారణమయ్యే లూటినైజింగ్‌ హార్మోన్‌ , ఫోలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ లపై మద్యం ప్రభావం చూపుతున్నట్లు తేల్చారు. దీని వల్లనే సంతానోత్పత్తి ప్రక్రియకు విఘాతం కలుగుతుందని నిర్ధారణకు వచ్చారు.

పరిశోధకులు ఎంచుకున్న వారంతా 25 ఏళ్ల నుండి 55 ఏళ్ల వయస్సు కలిగిన వివాహితులే. సర్వేలో పాల్గొన్న 81మంది మద్యం తాగేవారిలో 36మంది రోజువారీ ఆల్కహాల్‌ తీసుకోవడానికి అలవాటుపడ్డారు. పరీక్షల్లో వీర్యం పరిమాణం వీరిలో చాలా తక్కువగా ఉందని తేలింది. సంతానోత్పత్తి లేకపోవడానికి మద్యం సేవించడం ముఖ్యకారణంగా పరిశోధకులు భావిస్తున్నారు.