Air Pollution : వీర్య కణాల నాణ్యత, చలనశీలతపై వాయు కాలుష్య ప్రభావం…అధ్యయనాల్లో వెల్లడి
పురుషులు వారి పునరుత్పత్తి వయస్సులో వాయు కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Air Pollution
Air Pollution : వాయు కాలుష్యమనేది మానవజాతికి , పర్యావరణానికి పెద్ద ముప్పుగా పరిణమించింది. వాయుకాలుష్యం కారణంగా ఇప్పటికే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు , వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్ , దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనంలో వాయుకాలుష్యం వల్ల వీర్యం నాణ్యత, చలనశీలత పై కూడా ప్రభావితం అవుతున్నట్లు తేలింది.
తాజాగా జమా నెట్‌వర్క్స్ జర్నల్‌లో పరిశోధనకు సంబంధించిన జర్నల్ ప్రచురితమైంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం వల్ల పురుషుల సంతానోత్పత్తి ప్రక్రియ మెరుగవుతుందని, అస్తెనోజూస్పెర్మియా ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధన ద్వారా నిర్ధారించారు. పరిశోధన మొత్తం 30,000 మంది చైనీస్ పురుషులపై నిర్వహించబడింది. స్పెర్మ్ చలనశీలత , వీర్యం నాణ్యతకు ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. వాయు కాలుష్యం వల్ల వంధ్యత్వం అనేది ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పునరుత్పత్తి వయస్సు గల జంటలలో దాదాపు 10% మందిని ప్రభావితం చేస్తుంది అని అధ్యయనం తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 50% వంధ్యత్వానికి కారణం పురుష కారకాలు, ప్రధానంగా వీర్యం నాణ్యత. వీటితోపాటుగా జన్యుపరమైన నేపథ్యం ,పర్యావరణ కారకాలు వెరసి వీర్యం నాణ్యతను దెబ్బతీసేందుకు దోహదం చేస్తాయని ఈ అధ్యయనం ద్వారా పరిశోధకులు చెబుతున్నారు. వీర్యం నాణ్యత, చలనశీలతపై జన్యు ప్రభావం కంటే పర్యావరణ కారకాలకు సంబంధించిన ప్రభావమే అధికంగా ఉంటున్నట్లు వారు స్పష్టం చేశారు.
పురుషులు వారి పునరుత్పత్తి వయస్సులో వాయు కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్పెర్మాటోజెనిసిస్ సమయంలో రేణువుల వాయు కాలుష్యానికి గురికావడం వల్ల వీర్యం నాణ్యత, ముఖ్యంగా స్పెర్మ్ చలనశీలత ప్రతికూలంగా ప్రభావితం కావచ్చని సూచిస్తున్నాయి. సైన్స్ పరిభాషను అనుసరించి అస్తెనోజూస్పెర్మియా అనేది పురుషుల వీర్యం నమూనాలో తగ్గిన స్పెర్మ్ చలనశీలతకు వైద్యపరిభాషలో ఉపయోగించే పదం. ఈ పరిస్ధితి కారణంగా స్పెర్మ్ చేరకుండా నిరోధించడం, గుడ్డు ఫలదీకరణం కాకుండా చేయటం ద్వారా సంతానోత్పత్తిని నిలువరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం నిర్వహించిన అధ్యయనమే ఫైనల్ అని చెప్పలేమని రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రావాలంటే లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అధ్యయన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.