Workplace Friendships : జీవితంలో చాలా భాగం ఆఫీసులోనే.. కొలీగ్స్ మధ్య స్నేహబంధం ఎంతో ప్రత్యేకం

జీవితంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉన్నా.. జీవితంలో చాలా భాగం ఆఫీసు కొలీగ్స్ మధ్యలోనే గడిచిపోతుంది. వారితో సత్సంబంధాలు ఎంతో అవసరం. ఎన్నో విషయాల్లో మనకి వెన్నంటి ఉండే కొలీగ్స్ కూడా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ అవుతారు.

Workplace Friendships : జీవితంలో చాలా భాగం ఆఫీసులోనే.. కొలీగ్స్ మధ్య స్నేహబంధం ఎంతో ప్రత్యేకం

Workplace Friendships

Updated On : August 5, 2023 / 2:45 PM IST

Workplace Friendships : ఉద్యోగులు రోజులో ఎక్కువ భాగం ఆఫీసులో గడుపుతారు. చెప్పాలంటే జీవితంలోనే చాలా భాగం ఆఫీసులో గడిచిపోతుంది. ఆఫీసులో కొందరితో మంచి స్నేహాలు ఏర్పడతాయి. జీవితకాలం స్నేహితులు అవుతారు. ఆఫీసులో స్నేహాలు ఎంతవరకు అవసరం. వాటికి పరిధులు ఉన్నాయా?

Female-Male Friendships : ఆడవారు, మగవారు నిజంగా మంచి స్నేహితులుగా ఉండగలరా?

ఆఫీసుల్లో స్నేహాలు కాస్త విచిత్రంగానే ఉంటాయి. ఒక్కోసారి సీనియర్, జూనియర్ మధ్య మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఆఫీసు బయట చాలా చనువుగా ఉన్నా లోపల కొంచెం కష్టంగానే మెలగాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో స్నేహం, వృత్తి రెండిటినీ కలిపి చూడకూడదు. ఇక కొలీగ్స్ మధ్య స్నేహ సంబంధాలు పనిలో క్వాలిటీని పెంచుతాయి. తెలియని విషయాలు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలు పంచుకోవడం, తోటి ఉద్యోగి అవసరమైతే పనిలో సాయం చేయడం..ఇటువంటివి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సూచిస్తాయి.

 

ఆఫీసులో భిన్నరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు పని చేస్తుంటారు. అందరి మనస్తత్వాలు కలవకపోవచ్చును. కొందర సీరియస్‌గా తమ పని తాము చేసుకుని వెళ్లిపోతారు. కొందరు గలగల మాట్లాడుతూనే ఉంటారు. సీరియస్‌గా ఉండటం మంచిది కాదు.. అతిగా అనవసరంగా మాట్లాడటం అంత కన్నా మంచిది కాదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండటమే ఉత్తమం. అంటీముట్టనట్లుగా వ్యవహరించేవారితో ఎవరు కలవలేరు. కాబట్టి ఒకచోట పనిచేస్తున్నప్పుడు అక్కడి టీంతో కలిసి పనిచేయడం తోటి వారితో అవసరమైన మేరకు మాట్లాడటం ఎంతో మంచిది. టీ బ్రేక్‌లో కాసేపు అందరూ సరదాగా మాట్లాడుకోవచ్చు. కొన్నిచోట్ల దొరికే ఆ కాస్త సమయాన్ని ఇతరులపై గాసిప్స్ చెప్పుకోవడానికి ఉపయోగిస్తారు. గాసిప్స్ చెప్పేవారే కాదు.. అవి వినేవారిపట్ల ఎవరికి గౌరవం ఉండదు. గాసిప్స్ మాట్లాడేవారితో జనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు.

Friendship Hindu mythology : పురాణాల్లో దోస్తులు.. మంచైనా, చెడైనా స్నేహితులని వదలలేదు

ఆఫీస్‌కి వస్తూనే కొలీగ్స్‌ని విష్ చేయడం.. వారి పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో శుభాకాంక్షలు చెప్పడం చాలా మంచి అలవాటు. అలా ఉండటం వల్ల మీ మీద తోటి ఉద్యోగులకు మంచి భావన కలుగుతుంది. తోటి ఉద్యోగుల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకుండా వారితో అవసరమైన మేరకు మాట్లాడటం, వారికి ఏదైనా సాయం అవసరమైతే చేయడం వంటివి వర్క్ ప్లేస్‌లో స్నేహాలు బలపడటానికి దోహదపడతాయి. కొందరు తమ బాస్ గురించి పదే పదే విమర్శలు చేస్తూ కొలీగ్స్‌తో మాట్లాడుతుంటారు. అలా చేయడం వల్ల ఆఫీసు వాతావరణం పొల్యూట్ అవుతుంది. అది చివరికి బాస్ వరకూ చేరి మీమీద కంపెనీ సదభిప్రాయం కోల్పోయే ప్రమాదం ఉంది.. కాబట్టి కొలీగ్స్‌తో స్నేహంగా ఉంటూనే కంపెనీ బాధ్యతలను విస్మరించకుండా పనిచేయాలి.

 

స్నేహానికి సరిహద్దులు ఉంటాయి. వాటిని దాటితే చిక్కులు తప్పవు. అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం కూడా మంచిది కాదు. ఎవరితోనూ గొడవలు అంతకన్నా మంచివి కావు. అవి మనం చేసే పనిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అక్కర్లేని గొడవలతో మనసు పాడు చేసుకుంటే పనిమీద దృష్టి  పెట్టలేం. ఆరోగ్యకర వాతావరణంలో పనిచేయాలంటే అందరితో హాయిగా పలకరిస్తూ ముందుకు వెళ్లడమే. స్నేహబంధాలు కొనసాగించాలంటే కొన్ని హద్దులు పెట్టుకుని ముందుకు సాగడమే. ఆగస్టు 6 ‘అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం’. వర్క్ ప్లేస్‌లో మీ స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పండి. హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే.

Reconnect With Old Friends : చిగురులు తొడుగుతున్న పాత స్నేహాలు.. స్నేహితులకు వరం సోషల్ మీడియా