Teeth : సహజ దంతాలపై శ్రద్ధలేకుంటే.. కట్టుడు పళ్ళు తప్పదా!…
ఇటీవలి కాలంలో తక్కువ వయస్సువారు దంతసమస్యలకు గురై కట్టుడు పళ్ళు పెట్టించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది.

Teeth
Teeth : శరీరంలో ఏ అంగం లోపించినా, దానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ అంగాలను అమర్చే విధానాన్ని ‘ప్రొస్థటిక్స్’ అంటారు. దంత వైద్యపరంగా ఈ విధానాన్ని ‘ప్రొస్థటిక్ డెంటిస్ట్రి’ లేక ‘డెంటల్ ప్రొస్థటిక్స్’ అంటారు. వాడుక భాషలో ఈ పద్ధతినే పళ్ళు కట్టించుకోవడం అంటారు. కృత్రిమ దంతాలను అమర్చే విధానం అనుకున్నంత సులభం కాకపోయినా, పెద్ద కష్టమయిన పనేమి కాదు. పూర్వం స్ప్రింగు పద్ధతుల ద్వారా దంతాలను మార్చేపద్ధతి వాడుకలో వుండేది. తరువాత కాలంలో వాక్స్ విధానం అమలులోకి వచ్చింది. ఈ పద్దతిలో లోపాలు ఎదురుకావటంతో దానికి స్వస్ధి చెప్పారు.
పళ్లు లేనప్పుడు వాటి స్థానంలో కృత్రిమంగా అమర్చుకొనే పాక్షిక దంతాలు అందుబాటులోకి వచ్చాయి. పాక్షికదంతాలను తిరిగి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అవసరమయినప్పుడు తీసి-పెట్టుకొనే అవకాశం కలిగి వున్న దంతాలు మొదటి రకం. వీటిని ‘రిమువబుల్ పార్షియల్ డెంచర్స్’ అంటారు దీనికి భిన్నంగా, అతి సహజంగా మళ్ళీ తీయడానికి అనువుకాకుండా, స్థిరంగా వుండే దంతాలు రెండో రకం. వీటిని ఫిక్స్ పార్షియల్ డెంచర్స్ అంటారు. ఇవి సహజ దంతాలకు అతి చేరువగా వుంటాయి. పుల్ డెంచర్స్‌లో కూడా రెండు రకాలు ఉన్నాయి. మొదటి రకం రిమువబుల్ పుల్ డెంచర్స్, రెండవ రకం ఫిక్స్‌డ్ పుల్ డెంచర్స్ వీటినే ఇంప్లాంట్ డెంచర్స్ అని కూడా అంటారు. దవుడ ఎముకలో శస్త్ర చికిత్స చేసి తద్వారా ఈ పళ్ళను అమరుస్తారు.
కృత్రిమ దంతాలను ధరించేవారు, దంతధావనం విషయంలో సహజ దంతాలపై తీసుకొనే శ్రద్ధ కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవలసి వుంటుంది. లేకుంటే నోటి దుర్వాసన వచ్చే అవకాశం వుంటుంది. సరిగా అమరని దంతాల విషయంలో దంతవైద్యుల దృష్టికి తీసుకువచ్చి, త్వరగా సరిచేయించుకోవాలి. విరిగిన కట్టుడు పళ్ళను, కదిలి వదులుగా ఉన్న కట్టుడు పళ్ళను ఎట్టి పరిస్థితిలోను వాడకూడదు. కట్టుడు పళ్ళను కట్టుడు పళ్ళగానే చూడాలి తప్ప, తమ గత సహజ దంతాలను దృష్టిలో ఉంచుకొని చూడకూడదు.
ఇటీవలి కాలంలో తక్కువ వయస్సువారు దంతసమస్యలకు గురై కట్టుడు పళ్ళు పెట్టించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. అలా కాకుండా సహజసిద్ధమైన పళ్ళతోనే ఎక్కువకాలం జీవించాలంటే దంతాల విషయం జాగ్రత్తలు పాటించటం మంచిది. దంతాలే కదా అని తక్కువ అంచనా వేస్తే.. పెద్ద నష్టమే జరగొచ్చు. చిగుళ్ల వ్యాధికి హార్ట్ ఎటాక్, డయాబెటిస్ లాంటి వ్యాధులకు సంబంధం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పళ్లు తోముకోవడానికి సరైన టూత్ బ్రష్‌ను ఎంపిక చేసుకోండి. నోట్లోని అన్ని మూలలకు చేరేలా ఉండే ఫ్లెక్సిబుల్ బ్రష్‌ను మాత్రమే వాడాలి. టూత్ పేస్ట్‌ను కొద్దిగానే వాడాలి. పిల్లలకు కూడా కొద్దిగానే టూత్ పేస్ట్ ఇవ్వాలి. వారు పేస్ట్ మింగకుండా చూడాలి.
చల్లని, వేడి పదార్థాలు తినేటప్పుడు దంతాలు ఝుమ్మని లాగుతున్నట్లయితే యాంటీ సెన్సిటివిటీ టూత్ పేస్టులు వాడటం ఉత్తమం. దంతాలు తెల్లగా మెరవడం కోసం ఏది పడితే అది వాడొద్దు. డెంటిస్ట్‌లు సూచించే పేస్టే వాడండి. రోజూ రెండు సార్లు, రెండు నిమిషాల చొప్పున బ్రష్ చేసుకోవాలి. పంటిగార దంత క్షయానికి దారి తీస్తుంది. చిగుళ్ల సమస్య కూడా వస్తుంది. కాబట్టి తరచుగా ఫ్లాసింగ్ చేయడం తప్పనిసరి. నోటి దుర్వాసనను అప్పటికప్పుడు పోగొట్టేందుకు, చిగురు వాపును పొగొట్టేందుకు థెరపిక్ మౌత్ వాష్ వాడటం మంచిది.